
- జిల్లాలో 21 సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్న ఒప్పందం ఉల్లంఘన
- రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య
- ప్రమాదాల బారినపడుతున్న వాహనదారులు
- కాంట్రాక్టర్‌పై గత సీపీ కల్మేశ్వర్ సింగనేవార్ సీరియస్
- తూతూ మంత్రంగా పనులు.. సీపీ ట్రాన్స్ఫర్ తర్వాత యదాతధం
- స్టాప్లైన్స్ ఏర్పాటులోనూ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం
నిజామాబాద్, వెలుగు: ట్రాఫిక్ నియంత్రణకు ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నల్స్, మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం చాలా అవసరం. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం సిగ్నల్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. 21 చోట్ల సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు వరంగల్‌కు చెందిన కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకుని ఉల్లఘించడం జిల్లావాసులకు శాపంగా మారింది. నిజామాబాద్ సిటీలో ఐదు, ఆర్మూర్ లో రెండు చౌరస్తాల వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేసి, బోధన్, భీంగల్ మున్సిపాలిటీలలో సిగ్నల్స్ ఏర్పాటును గాలికొదిలేశాడు.
దీంతో వాహనదారుల అడ్డదిడ్డంగా రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయి. సిగ్నల్స్ వద్ద తెల్ల పెయింట్‌తో స్టాప్లైన్స్ వేయించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి రోడ్డు సేఫ్టీ సమావేశాలు ఓ తంతుగా నిర్వహిస్తున్నారే తప్పా.. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
జిల్లాలో నిత్యం 3 లక్షల మంది రాకపోకలు..
జిల్లా జనాభా 18.01 లక్షలు. ఇందులో 33 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 41 కిలోమీటర్లు విస్తరించి ఉన్న నిజామాబాద్ నగరంలో 3.25 లక్షల జనాభా ఉంది. ప్రతి రోజు విద్యార్థులతో సహా, సుమారు లక్షన్నర మంది రోడ్లపైకి వస్తుంటారు. పల్లెలు, మండల కేంద్రాల నుంచి మరో లక్షన్నర మంది నిజామాబాద్‌కు వస్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. జిల్లాలో 4.70 లక్షలు వాహనాలు ఉండగా, టూవీలర్స్3,90,126 ఉన్నాయి. కార్లు, ఇతర ఫోర్ వీలర్ వెహికల్స్ 47,122 ఉండగా, ఆటోరిక్షాలు, ఇతర వాహనాలు 31 వేలు ఉన్నాయి. దీనికితోడు ప్రతి నెలా సుమారు 3 వేల కొత్త బండ్లు రోడ్లపైకి వస్తున్నాయి. రోజుకూ పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన జిల్లాయంత్రాంగం పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో జిల్లావాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఒప్పందాన్ని బేఖాతరు చేసిన కాంట్రాక్టర్..
నాలుగు దిక్కులా రోడ్లున్న 21 ముఖ్య కూడళ్ల వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని వరంగల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ పోలీస్ యంత్రాంగంతో ఒప్పందం చేసుకున్నాడు. డిజిటల్ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్కమ్ తో సిగ్నల్ నిర్వహణ ఖర్చులు భరించాలని అగ్రిమెంట్లో పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో పులాంగ్, నిఖిల్ సాయి హోటల్, కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, కంఠేశ్వర్ బైపాస్, సాయిరెడ్డి పెట్రోల్ పంప్ వద్ద కలిపి మొత్తం ఆరు చోట్ల మాత్రమే సిగ్నల్స్ ఏర్పాటు చేసి, మిగతావి ఏర్పాటు చేయకపోవడంతో గత సీపీ కల్మేశ్వర్ సింగనేవార్ కాంట్రాక్టర్‌ను పిలిపించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
అధికంగా ట్రాఫిక్ సమస్య ఉండే రుక్మిణి చాంబర్, బోధన్ బస్టాండ్, అర్సాపల్లి, ఖానాపూర్ జంక్షన్, విజయ్ పబ్లిక్ స్కూల్ వద్ద మరో ఐదు సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని హెచ్చరించారు. ఆర్మూర్‌లో మామిడిపల్లి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా వద్ద గల సిగ్నల్స్ నిర్వహణ లోపాలను సరిచేయాలని, బోధన్, భీంగల్ మున్సిపాలిటీలలో సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని అల్టిమేటం ఇచ్చారు. అయితే గత అక్టోబర్ నెలలో సీపీ ట్రాన్స్ఫర్ కావడంతో కథ మొదటికొచ్చింది. ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.
స్టాప్ లైన్లపై బల్దియా చోద్యం
వాహనాలు నిలిపే స్టాప్ లైన్స్ వేయించడంలో బల్దియా చోద్యం చేస్తున్నది. సిగ్నల్ పడినప్పుడు తెల్ల రంగు పెయింటింగ్ స్టాప్ లైన్స్ వద్ద వెహికల్స్ ఆపాల్సి ఉంటుంది. స్టాప్లైన్స్ వేయించాలని ట్రాఫిక్ పోలీసుల నుంచి మున్సిపల్ అధికారులకు లెటర్లు వెళ్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం సరిగా లేక పట్టణ ప్రాంతాల్లో గతేడాది జరిగిన ప్రమాదాల్లో 258 మంది క్షతగాత్రులు కాగా, 28 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 42 ప్రమాదాలు జరుగగా, 9 మంది మృతి చెందారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే..
కంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల సిగ్నల్ సిస్టం ఏర్పాటు కాలేదు. ఒప్పందం ప్రకారం సిగ్నల్స్‌కు ఏర్పాటు చేయకుంటే చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా వాహనాలను కంట్రోల్ చేయడం కష్టం. స్టాప్లైన్స్ఏర్పాటుతోపాటు రోటరీ పార్క్‌ను మున్సిపాలిటీలు నిర్మించాలి. - నారాయణ, ట్రాఫిక్ ఏసీపీ