
- నల్గొండలో 480 మంది పోటీ
- వ్యవసాయాన్ని కాపాడాలంటూ తమిళనాడులో వెయ్యి మంది రైతులు
- తమ ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలని బెల్గాం మరాఠీల నామినేషన్లు
- ఇప్పుడు పంటలకు మద్దతు ధర కోసం నిజామాబాద్ రైతులు
1996 లోక్ సభ ఎన్నికల సమయంలో దేశమంతా ఒక్కసారి గా నల్గొండ వైపు చూసింది. ఇక్కడి లోక్ సభ స్థానానికి ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా 650మందికి పైగా నామినేషన్ వేశారు. స్క్రూటినీ తర్వాత480 మంది అభ్యర్థు లు పోటీలో మిగిలారు. మరి ఇంతమంది ఎందుకు పోటీ చేశారో తెలుసా.. వారంతా ఫ్లోరైడ్ బాధిత గ్రామాల ప్రజలు. ఫ్లోరైడ్కారణంగా కాళ్లు, చేతులు, నడుము వంగిపోయి.. జీవచ్ఛవాల్లా మారిపోతున్న తమ దీన స్థితిని అందరి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వాలు దిగివచ్చేలా చేసుకునేందుకు ‘నామినేషన్ ’ పోరుకు దిగారు. తమ ప్రాంతానికి తాగు, సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు.
జల సాధన సమితితో..
జల సాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యం లో నామినేషన్ల ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రతి ఊరి నుంచి వీలైనంత మంది నామినేషన్ వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దానితో పెద్ద సంఖ్యలో జనం ముందుకు వచ్చారు. 650కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూటినీ తర్వాత 480 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ఏకంగా 50 పేజీలతో ఓ బుక్లెట్ లా బ్యాలెట్ పేపర్లను ముద్రించాల్సి వచ్చింది. ఆబ్యాలెట్ పేపర్ల కోసం ప్రత్యేకంగా పెద్ద సైజు బ్యాలెట్ బాక్సులను తయారు చేయించారు. మే 27న ఎన్నికనిర్వహించారు. పోలింగ్ రోజున సమయాన్ని రెండుగంటలు పెంచారు. లెక్కింపు కూడా సుదీర్ఘంగా జరిగింది. బ్యాలెట్ పేపర్ లో 331వ నెంబర్ లో ఉన్న సీపీఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షం గెలుపొందారు. దేశ ఎన్నికల చరిత్రలోనే ఏకంగా 480 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సెగ్మెంట్ గా నల్గొండ నిలిచింది. తర్వాతి స్థానంలో కర్నాటకలోని బెల్గాం లోక్ సభస్థానం ఉంది. ఇది కూడా 1996లోనే జరిగింది.
కర్నాటకలో మరాఠీలు..
ప్రస్తుతం కర్నాటకలో ఉన్న బెల్గాం ప్రాంతాన్నిమహారాష్ట్రలో కలపాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ఏకీ కరణ్ సమితి (ఎంఈఎస్ ) ‘నామినేషన్ ’ పోరుకు తెరతీసింది. 1996 ఎన్నికల్లో కర్ణాటకలోని బెల్గాం లోక్ సభ స్థా నంలో 452 మందిని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దింపింది. వివిధ పార్టీలనుంచి మరో నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో క్యాండిడేట్లు ఉండటంతో ఈసీ ఎన్నికలను నెల రోజుల పాటు వాయిదా వేసింది. ఏర్పాట్లన్నీ చేసుకుని, ఎన్నిక నిర్వహించింది. జనతాదళ్ కు చెందిన శివానంద్ హేమప్ప గెలిచారు.అయితే ఈ ‘నామినేషన్ ’ పోరుతో దేశవ్యాప్తంగా తమ డిమాండ్ వినిపించేలా చేశారు. ఈసారి కూడా లోక్ సభ స్థానంలో 101 మంది అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించింది. అభ్యర్థులకు సెక్యూరిటీ డిపాజిట్ కోసం విరాళాలను సేకరిస్తోంది.
నల్గొండ సమస్యలు తీరలేదు..
నల్గొండ జనం ఫ్లోరైడ్ బాధతో, తమిళనాడు రైతులు పంటలకు మద్దతు ధర కోసం, బెల్గాం మరాఠీ జనం తమ ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలన్న డిమాండ్ తో నామినేషన్ల పోరుకు తెరలేపారు. ఇదిజరిగి సుమారు 23 ఏండ్లు గడిచింది. కానీ ఇప్పటికీసమస్య తీరలేదు. ఇప్పటికీ నల్గొండ ప్రాంతం పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఒక్క తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి ఇప్పటికీ దయనీయంగానే ఉంది. తాజాగా నిజామాబాద్ రైతులు ఆబాధతోనే ఆందోళనకు దిగారు. బెల్గాం మరాఠీ జనం డిమాండ్ నైతే పట్టించుకునేవారే కరువయ్యారు.
ఎలక్షన్ రూల్స్ మాత్రం మారాయి..
1996 ఎన్నికల్లో పలు లోక్ సభ, అసెంబ్ లీ స్థానాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంపై ప్రభుత్వాలు ఏమోగానీ, ఎలక్షన్ కమిషన్ మాత్రం వెంటనే స్పందించింది. అప్పట్లో డిపాజిట్ సొమ్ము గా లోక్సభకు జనరల్ అభ్యర్థు లు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ.250, అసెంబ్ లీకి జనరల్ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీలు రూ.125 చెల్లించాల్సి ఉండేది. ఇలా తక్కు వగా ఉండటంతో ఇష్టం వచ్చినట్టుగా నామినేషన్లు వేస్తున్నారని.. లోక్ సభకు రూ.25,000, రూ.12,500కు, అసెంబ్ లీకి రూ.10,000, రూ.5,000కు పెంచేసింది. నామినేషన్ల దాఖలు కోసం మరిన్ని కఠిననిబంధనలనూ అమల్లోకి తెచ్చింది.
ఈవీఎంలతో కుదరదు
ప్రస్తుతం ఎన్నికల్లో వినియోగిస్తున్న సాధారణ ఈవీఎంలలో నోటాతో కలిపి 64 మంది అభ్యర్థులతోఎన్నిక నిర్వహించవచ్చు. అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఆధునిక ‘ఎం3 ఈవీఎం’లలోమాత్రం 384 మంది వరకు అభ్యర్థుల పేర్లను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. ఒక్కో ఈవీఎంలో ఒక కంట్రోల్ యూనిట్ తోపాటు ఏకంగా24 వరకు బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాని ఏర్పాటు, సిబ్బంది, రవాణాతో పాటుగందరగోళం వంటి సమస్యలెన్నో ఉన్నాయి.