దొరల పాలన నుంచి విముక్తి పొందాలి : షబ్బీర్​అలీ

  • రాష్ట్రం మొత్తం కేసీఆర్​ కుటుంబం చేతిలో బందీ  

నిజామాబాద్, వెలుగు: ప్రజాపాలన ఏర్పడాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ప్రస్తుతం రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబ చేతిలో బంధీ అయిందని కాంగ్రెస్​ నిజామాబాద్​అర్బన్​ అభ్యర్థి షబ్బీర్​అలీ విమర్శించారు. దొరల కుటుంబం నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించే ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దన్నారు. సోమవారం ఆయన నగరంలోని పలు ఏరియాల్లో కార్నర్ ​మీటింగ్​లు నిర్వహించారు.​ 

ఇసుక, ల్యాండ్​మాఫియా, కాంట్రాక్ట్​ పనుల్లో కమీషన్లతో బీఆర్ఎస్ ​ప్రభుత్వం పేట్రేగిపోయిందన్నారు. వచ్చేది కాంగ్రెస్​ గవర్నమెంటేనని, కల్వకుంట్ల ఫ్యామిలీ చేసిన అవినీతిని వడ్డీతో సహా కక్కిస్తామన్నారు. సోనియా ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.2,500 అందిస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. 

రూ.500 వంట గ్యాస్, 200 యూనిట్ల వరకు ఇండ్లకు ఉచిత కరెంట్​ఇస్తామన్నారు. అర్బన్​లో బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీల అభ్యర్థులు గెలిస్తే ఏం చేస్తామో చెప్పకుండా,  నువ్వేంత అంటే నువ్వేంత అన్నట్లు సవాళ్లు విసురుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్​కు పెరుగుతున్న ఆదరణ చూసి, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. 41, 42, 50 డివిజన్లకు చెందిన పలువురు బీఆర్ఎస్​ పార్టీకి చెందిన లీడర్లు కాంగ్రెస్​లో చేరారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్, కేశవేణు, రత్నాకర్, నజీబ్​అలీ, జావీద్ అక్రమ్, ఎజాజ్​పాల్గొన్నారు.

Also Read :-రాష్ట్రమిచ్చాం.. అభివృద్ధి కూడా చేస్తాం : మురళీనాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌