వెన్ను తట్టి ప్రోత్సహించినోళ్లే వెన్నుపోటు పొడిచిన్రు

వెన్ను తట్టి ప్రోత్సహించినోళ్లే వెన్నుపోటు పొడిచిన్రు
  • మెదక్​ ఎమ్మెల్యే, ఆమె భర్త నాపై పగ పెంచుకున్నారు
  • అవమానాలు తట్టుకోలేకనే బీఆర్ఎస్ కు 
  • రాజీనామా చేస్తున్న నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు విజయ్ కుమార్

మెదక్, వెలుగు: తనను రాజకీయాల్లోకి రావాలని వెన్నుతట్టి ప్రోత్సహించినోళ్లే వెన్నుపోటు పొడిచారని మెదక్​జిల్లాలోని నిజాంపేట మండల జడ్పీటీసీ మెంబర్​పంజా విజయ్ కుమార్ ఆరోపించారు. బీసీని అయిన తనని అణగదొక్కాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవమానాలు, వివక్ష భరించలేక బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం మెదక్​లో ప్రెస్​మీట్​పెట్టి రాజీనామాకు గల కారణాలు విజయ్ ​వెల్లడించారు. మొదట్లో ప్రోత్సహించిన వ్యక్తులే.. ఇప్పుడు తన వెనుక గోతులు తవ్వుతున్నారని పరోక్షంగా బీఆర్ఎస్​ లీడర్, మెదక్​ఎమ్మెల్యే పద్మారెడ్డి భర్త దేవేందర్​రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మండలంలో విద్యా, వైద్య సదుపాయాలు, రోడ్ల బాగు కోసం నిధులు మంజూరు చేయించాలని ఎన్నిసార్లు కోరినా ఎమ్మెల్యే పద్మ స్పందించలేదని, పైగా ఏదీ అడగొద్దని వార్నింగులు ఇచ్చేవారని ఆరోపించారు.

 బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న కొందరు సర్పంచులకు అండగా నిలబడినందుకు తనను దూరం పెట్టారని, రామాయంపేట రెవెన్యూ డివిజన్​సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా పాదయాత్ర చేసినందుకు మరింత పగ పెంచుకున్నారన్నారు. తన వ్యక్తిగత లాభం కోసం ఇన్నాళ్లు పనిచేసినట్టు నిరూపిస్తే మెదక్ రాందాస్​చౌరస్తాలో ఉరి వేసినా ఓకే అన్నారు. తనకి, తన అనుచరులకు ఎలాంటి సహకారం అందించవద్దని తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్సైలకు ఎమ్మెల్యే, ఆమె భర్త హుకుం జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనాపూర్ సొసైటీలో రెండున్నర కోట్లు దుర్వినియోగం అయినట్టు ఎంక్వైరీలో తేలినా ఆ సొసైటీ చైర్మన్​దేవేందర్​పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మెదక్ నియోజకవర్గంలో నయా నిజాం పాలన నడుస్తోందని ఆరోపించారు. తనలాగా బీఆర్ఎస్​లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు ఎంతో మంది ఉన్నారని, వారందరిని కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని విజయ్​కుమార్ వెల్లడించారు.