నిజాం రాజ్యంలో మహబూబ్ అలీఖాన్ పాలన వరకు పార్సీ రాజకీయ భాషగా ఉండేది. ఆరో నిజాం ఉర్దూను రాజకీయ భాష చేశాడు. మొగలులు తెచ్చిన భారతీయ భాష ఉర్దూ. మొగల్ సైన్యంలో అనేక ప్రాంతాల వారు ఉండేవారు. వారికి సంధాన భాషగా ఏర్పడిందే ఉర్దూ భాష. ‘ఉర్దూ’కు అర్థం ‘సైన్యం’. అది సైన్యం కోసం ఏర్పడిన భాష. చివరకు అది ప్రజల భాష అయింది. ఉర్దూకు లిపి లేదు. పార్సీ లిపిని స్వీకరించారు. అది ఎడమ నుంచి కుడికి సాగుతుంది. ఉర్దూలో ఎంతో ఉత్తమ సాహిత్యం వచ్చింది. చివరి నిజాం మీర్ ఉస్మానలీ ఖాన్ ఉర్దూ భాషను మతానికి అంటగట్టి, ఆదమరుపు ఆయుధంతో మన మాతృభాషను సమాప్తం చేయడానికి ప్రయత్నించాడు. వేష భాషలనూ అణగదొక్కాడు. నాటి ప్రజల ఉద్యమం నిజాం నవాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిందే కానీ, ఏ మతానికి, ఏ భాషకు వ్యతిరేకంగా కాదు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్1911లో గద్దెనెక్కాడు. అప్పటి నుంచి ఒక పథకం ప్రకారం తెలుగును తుడిచి పెట్టడానికి ఉర్దూ బావుటాను కరవాలంగా ఉపయోగించాడు. అంతకు ముందు ఉండిన ప్రభుత్వాలు సైతం తెలుగును గుర్తించలేదు. ప్రోత్సహించలేదు. ఉస్మాన్ అలీ తన భద్రత కోసం ఒక భాషను, ఒక మతాన్ని పోషించాడు. అతనికి ప్రజలతో, వారి భాషతో పని లేదు. తాను నిరంకుశంగా పాలించగలనని, ప్రజా ఉద్యమాలను అణచివేయగలనని భావించాడు. ఉత్తరాన మహమ్మద్అలీ జిన్నాను- దక్షిణాన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ను తమ స్వప్రయోజనాల కోసం ఆంగ్లేయులు ప్రోత్సహించారు.
ఉస్మానియా యూనివర్సిటీ స్థాపన
1918లో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఓయూను ప్రారంభించాడు. ఉస్మానియాలో ఉర్దూ బోధనా భాష చేశాడు. కానీ, బ్రిటీష్ ఇండియాలో ప్రజల భాషనే బోధనా భాషగా చేశారు. దేశపు నడిబొడ్డున అన్ని భాషలకు కాకుండా కేవలం ఉర్దూ మాత్రమే బోధనా భాషగా వర్సిటీని స్థాపించడంలోని ఉస్మాన్ కుయుక్తిని గమనించవచ్చు. తాను దేశాభిమానిని అని, ఉర్దూ అభివృద్ధికి వర్సిటీ ప్రారంభిస్తున్నానని జాతీయ నాయకులకు చెప్పాడు. కానీ ఆయన భాషా కుట్రను జాతీయ నాయకులకు చెప్పేటోళ్లు నిజాం రాజ్యంలో ఎవరూ లేరు. అందుకే రవీంద్ర కవీంద్రుడు ఓయూ స్థాపనను ప్రశంసిస్తూ నిజాంకు లేఖ రాశారు. మహాత్ముని వంటివారు ప్రశంసించలేదు కానీ సొంత కారణాల వల్ల నిరసించలేక పోయారు. ఉస్మానియాలో తెలుగు శాఖ ఉన్నమాట నిజం. ఆ శాఖ నిజాం ప్రశంసలకే కానీ తెలుగును ప్రోత్సహించడానికి కాదని ప్రజలకు తెలుసు. అదీ గాక తెలుగు శాఖలో చేరే వారిపై ప్రభుత్వ దృష్టి ఉండేది. ‘‘తెలంగీ చేడంగీ’’ తెలుగు వికార భాష అనే నినాదం ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రచారంలోకి వచ్చింది. తెలుగులో చదవడానికి ఎన్నో అవరోధాలు ఉండేవి. మడికొండకు చెందిన పల్లా దుర్గయ్య ఈ అవరోధాలను అధిగమించి మనుచరిత్రను పరిశోధించి డాక్టరేట్ పొందారు. ‘గంగిరెద్దు’ వంటి ఖండ కావ్యాలు రచించారు. ఉస్మానియా నుంచి తెలుగు ఫ్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. నిజాం రాజు భాష, ఇక్కడి శాసనాలు, ఆఫీసులో వ్యవహార భాష, కోర్టు భాష, గెజిట్ భాష, నాణేల మీద, దుకాణాలు వగైరా బోర్డులన్నీ ఉర్దూలోనే. నిజాం సాంతం ఉర్దూమయం.
భాషకు ఆదరణ లేక ఉపాధి కరువు..
నిజాం సంస్థానంలో సామాజిక పరిస్థితులు ఇందులో భిన్నంగా లేవు. ఊళ్లలో దొరల పెత్తనం, కులమతాల ప్రభావం ఉండేది. బ్రిటీష్ ఇండియాలో వలె సంస్కరణ ఉద్యమాలు శూన్యం. ఉద్యమం అంటే సర్కారుకు మంట. కనీసం అభివృద్ధిని సహించలేని దృష్టి. నిజాం రాజ్యంలో చదువు వచ్చిన వారికి ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం లేదు. పల్లెల్లో కులవృత్తులు అడుగంట లేదు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది. నిజాం రాజ్యంలో స్కూలు చదువు ఉచితం. ఫీజులు ఉండేవి కావు. సర్కారు బడికి పిల్లలను ఎక్కువ మంది పంపేవారు కారు. ఉర్దూ చదువు నిత్య జీవితంలో పనికి వచ్చేది కాదు. పెద్ద చదువులు చదివినా తురుకలకు తప్ప మిగతా వారికి ఉద్యోగాలు రావు. అందువల్ల వీధిబళ్ళలో అక్షరాల చదువు, పెద్దబాలశిక్షతో చదువు ముగింపు. నిత్య జీవితానికి అక్కరకు వచ్చేవన్నీ పెద్ద బాలశిక్షలో ఉంటాయి. అంతకు పైన చదవాలనుకునేవారు పండితుల వద్ద పోతన భాగవతం చదివే వారు. నిజాం రాజ్యంలో మాతృ భాష(తెలుగు), బతుకు భాష(ఇంగ్లీషు) లేక దేశ స్వాతంత్ర్యానంతరం తెలంగాణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను బాగా కోల్పోయింది. ఈ చరిత్రను వచ్చిన తెలంగాణలో తిరగ రాశామా లేదా అని సెప్టెంబర్17 నాడైనా పాలకులు మననం చేసుకోవాలి.
- కొలనుపాక కుమారస్వామి, వరంగల్