మళ్లీ తెరపైకొచ్చిన నిజాం ఖజానా!

నిజాం అనగానే హైదరాబాద్ సంస్థానం ఎలా గుర్తుకు వస్తోందో ఆయన ఆస్తిపాస్తులు కూడా అంత స్పీడ్ గా గుర్తుకువస్తాయి. ఈ ఆస్తిపాస్తుల మీద ఒకటా రెండా ఎన్నో గొడవలు. ప్యాలెస్ లు మొదలుకుని నగల దాకా రకరకాల తగాదాలు. వీటిల్లో ఒక తగాదా త్వరలోనే సాల్వ్ కాబోతుందన్న వార్త మళ్లీ నిజాం ను గుర్తు చేసింది. 70 ఏళ్లుగా కొనసాగుతున్న  కోర్టు గొడవకు   త్వరలోనే తెర పడబోతోంది. అదేదో ఇద్దరు సాదాసీదా వ్యక్తులకు సంబంధించిన సివిల్ కేసు కాదు. పాకిస్థాన్ కు, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారసులకు  మధ్య నడుస్తున్న ఆస్తి తగాదా. 1948లో మొదలై ఇదిగో ఇప్పటివరకు కోర్టు గేటు దాటలేదు.

నిజాం ఆస్తుల కేసు ఫ్లాష్ బ్యాక్ గమ్మత్తుగా ఉంటుంది. 1948లో అంటే అప్పటికి దేశానికి స్వతంత్రం వచ్చి ఏడాదైంది. అయితే హైదరాబాద్ సంస్థానం ఇంకా ఇండియాలో  విలీనం కాలేదు. ఇండియాలో చేరాలా లేక పాకిస్థాన్ తో కలవాలా, స్వతంత్ర రాజ్యంగా కొనసాగాలా  అనే డైలమాలో  ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నారు. ఈ సమయంలో అంటే 1948లో  మీర్ ఉస్మాన్ అలీన్ ఖాన్ బ్రిటన్ లోని పాకిస్థాన్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహీంతులా బ్యాంక్ అక్కౌంట్ కు  పది లక్షల పౌండ్లు ట్రాన్స్ ఫర్ చేశారు.  పంపిన  సొమ్మును భద్రం చేయాలని హబీబ్ ఇబ్రహీం ను కోరారు. ఆ తర్వాత దేశంలో అనేక మార్పులు సంభవించాయి.

హైదరాబాద్ సంస్థానం, ఇండియాలో విలీనం అయింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇక్కడే ఉండిపోయారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పంపిన అమౌంట్ అప్పటి నుంచి వడ్డీ సహా 35 మిలియన్ పౌండ్లకు అంటే 307 కోట్ల రూపాయలకు చేరింది. ఈ సొమ్ము దగ్గరే వచ్చింది అసలు పేచీ. ఈ డబ్బు తమకే చెందుతుందని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారసులు ప్రిన్స్ ముకరంజా, ఆయన సోదరుడు ముఫ్ కంజా వాదిస్తున్నారు.లండన్ బ్యాంకులో ఉన్న సొమ్మును 1963 ఏప్రిల్ లో ఒక ట్రస్ట్ ద్వారా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కానుకగా ఇచ్చారన్నది ప్రిన్స్ ముకరంజా, ఆయన సోదరుడు ముఫ్ కంజా వాదన. దీంతో నిజాం సొమ్ముకు  తామే అసలైన వారసులమని వాదిస్తున్నారు.  ఏడో నిజాం వారసుల వాదనకు  ఇండియా మద్దతు పలికింది. అయితే ప్రిన్స్ ముకరంజా, ముఫ్ కంజా వాదనలను  పాకిస్థాన్ తోసి పుచ్చుతోంది. లండన్ లోని నాట్ వెస్ట్ బ్యాంకులో భద్రంగా ఉన్న నిజాం సొమ్ము పై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని అడ్డగోలుగా వాదిస్తోంది.

జస్టిస్ మార్కస్ స్మిత్ ఈ కేసుపై లేటెస్ట్ గా రెండు వారాల పాటు విచారణ జరిపారు. ఈ విచారణలో రెండు పక్షాలు తమ వాదనలకు మద్దతుగా కోర్టుకు ఆధారాలు సమర్పించాయి.ఇక నాట్ వెస్ట్ బ్యాంకులో ఉన్న నిజాం నిధులకు అసలైన వారసులు ఎవరనేది బ్రిటన్ కోర్టు తేల్చాల్చి ఉంది.  జస్టిస్ మార్కస్ స్మిత్  తీర్పు వాయిదా వేశారు. అయితే ఒకట్రెండు నెలల్లోనే  తీర్పు రావచ్చని లండన్ వర్గాల సమాచారం.

హైదరాబాద్ పై ఏడో నిజాం ముద్ర

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడో నిజాం. హైదరాబాద్ లోని పురానీ హవేలీలో 1886  ఏప్రిల్ 6న పుట్టారు. 1911 లో  ఏడో నిజాం గా హైదరాబాద్ సంస్థానానికి పాలకుడయ్యారు. అసఫ్ జాహీ పాలకులలో ఈయనే చివరి వాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అత్యంత సంపన్నుడిగా పేరొందారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని  స్వతంత్ర రాజ్యంగా చేయడానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రయత్నించారు. దీంతో ఉస్మాన్ అలీ ఖాన్ తో భారత ప్రభుత్వం అనేక సార్లు సంప్రదింపులు జరిపింది. చివరకు 1948 సెప్టెంబర్ 13న ‘ఆపరేషన్ పోలో’ పేరుతో  సైనిక చర్య జరిపి హైదరాబాద్ సంస్థానాన్ని  ఇండియన్ యూనియన్ లోకి విలీనం చేసుకుంది. ఆ తర్వాత 1956 వరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్ ప్రముఖ్ హోదాలో కొనసాగారు. 1956లో భాషల ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడ్డాక  మీర్ ఉస్మాన్ అలీ ఖాన్  రాజ్ ప్రముఖ్ హోదా  కోల్పోయారు. ఏడో  నిజాం హోదాలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు.

1918 లో ఉస్మానియా యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. ఉస్మాన్ సాగర్,  హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు ఆయన హయాంలో వచ్చినవే. నిజాం స్టేట్ రైల్వేస్ కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో వచ్చినదే. ప్రపంచపటంపై  హైదరాబాద్ కు ఒక గుర్తింపు వచ్చింది కూడా ఏడో నిజాం హయాంలోనే. ఒక్కటని కాదు హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్​ సొంతం చేసుకున్నారు. ఉస్మాన్​ అలీ ఖాన్​కు మంచి దాతగా పేరు. చాలా మంది ఆయనను పిసినారి అనుకుంటారు కానీ, గుప్తదానాలు చాలా చేశారు.

లక్షలాది రూపాయల సొమ్ము యూనివర్సిటీలకు, హాస్పిటళ్లకు, అలాగే మసీదులకు  దానం ఇచ్చారు. ఎవరైనా ఏ పనైనా చేయొచ్చనేది ఆయన సిద్ధాంతం. సాక్సును తనే సొంతంగా తయారుచేసుకునేవారని చెబుతారు.  ప్రపంచంలోకెల్లా ధనవంతుడని పేర్కొంటూ 1937 పిబ్రవరి 22 టైమ్​ మ్యాగజైన్​ కవర్​ పేజీపైన నిజాం ఫోటో వేశారు.  ప్రపంచంలోకెల్లా గొప్ప వజ్రాల్లో ఒకటిగా పేరుపడ్డ జాకబ్​ డైమండ్​ను పేపర్​ వెయిట్​గా నిజాం వాడుకునేవారని చెబుతారు. దీన్ని బట్టి ఆయన ఎంతటి ధనవంతుడో అర్థం చేసుకోవచ్చు. 1940 ప్రాంతాల్లోనే ఆయన ఆస్తుల విలువ 200 కోట్ల అమెరికన్​ డాలర్లుగా లెక్కగట్టారు.

నిజాం ఖజానాలో భాగమైన వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్ , బంగారు కప్పు సాసర్లను ఆమధ్య దొంగిలించారు. వాటిని తిరిగి పోలీసులు పట్టుకోగలిగారు. అప్పటినుంచి నిజాంకు సంబంధించిన అన్ని నగలకు భారీ సెక్యూరిటీ  ఏర్పాటు చేశారు.

వారసుడు ప్రిన్స్ ముకరంజా

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడే ప్రిన్స్ ముకరంజా. తండ్రి పేరు ఆజం ఝా. 1934 అక్టోబరు ఆరున ముకరంజా పుట్టారు. డూన్ స్కూల్ లో చదువుకున్నారు. ఆ తర్వాత కేంబ్రిడ్జి, లండన్ స్కూల్ ఆఫ్  ఎకనమిక్స్ లో పైచదువులు చదివారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు   ముకరంజా మంచి దోస్తు.  తర్వాత  ముకరంజా టర్కీకి  వెళ్లిపోయారు. అప్పుడప్పుడు  హైదరాబాద్ వచ్చి పాత మిత్రులను కలుసుకుని వెళ్తుంటారు.

ఇండియాకు అసైన్ చేస్తూ ఏడో నిజాం ఒప్పందం

నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1965లో లండన్ బ్యాంకులో దాచిన సొమ్మును ఇండియాకు అసైన్ చేస్తూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో కేసులో ఒక పార్టీగా ఇండియా ఉంది. అయితే  ఈ మధ్య కాలంలో నిజాం వారసులతో కుదిరిన ఒక ఒప్పందం మేరకు కేసునుంచి ఇండియా తప్పుకుంది. ప్రస్తుతం కేసు నిజాం వారసులు వర్సెస్  పాకిస్థాన్ ప్రభుత్వంగానే  నడుస్తోంది.

నిజాం నగల దర్జానే వేరు

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వద్ద  బోలెడన్ని  నగలు  ఉండేవి. భారతదేశంలో హైదరాబాద్​ విలీనమయ్యాక కొన్ని నగలు దేశం దాటిపోయాయి. ఇండియాలోనే ఉన్న నగల్లో కొన్నింటిని అప్పుడప్పుడు ప్రదర్శనగా పెడుతుంటారు. హైదరాబాద్ నగరంలో కూడా ఈ నగలు ప్రదర్శించారు. 11 ఏళ్ల తర్వాత వాటిని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో ప్రదర్శనగా పెట్టారు. వీటిలో కోహినూర్ వజ్రం కంటే రెండు రెట్లు పెద్దదైన జాకబ్ డైమండ్ అందర్నీ ఆకర్షించింది. 28 షోకేసుల్లో వజ్రాలు, రత్నాలు, పచ్చల హారాలు, బ్రేస్ లెట్లు, చెవిదుద్దులు, కంకణాలు, మెట్టెలు, ఉంగరాలు, ప్యాకెట్ వాచీలు వంటివి ఉన్నాయి.

పాకిస్థాన్ వాదన ఏమిటి ?

లండన్ బ్యాంకులో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జమ చేసిన సొమ్ముపై  తమకే హక్కు ఉందన్నది  పాకిస్థాన్ వాదన. ‘ ఆపరేషన్ పోలో’ లో భాగంగా అప్పటి హైదరాబాద్ సంస్థానంలోకి  ఇండియన్ మిలటరీ ప్రవేశించినప్పుడు నిజాం కు అండగా నిలిచింది తామేనని పాకిస్థాన్ వాదించింది. అప్పట్లో నిజాంకు తాము ఆయుధాలు సరఫరా చేశామని పేర్కొంది. దీనికి బదులుగానే  అప్పట్లో పాక్ హై కమిషనర్ బ్యాంక్ అకౌంట్ కు  మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన బ్యాంకు ఖాతా నుంచి 10 లక్షల పౌండ్లు బదిలీ చేశారని పేర్కొంది.

ఇంగ్లీషు కోర్టులకు అధికారం ఉందా ?

త్వరలో రాబోయే బ్రిటన్ కోర్టు తీర్పు రెండు విషయాలను స్పష్టం చేయబోతోంది.

మొదటిది:  నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సొమ్ము కు అసలు లబ్దిదారులు ఎవరనే అంశం.

రెండోది : ఇంగ్లీషు కోర్టులకు అసలు ఈ గొడవను  పరిష్కరించే అధికారం ఉందా అనే అంశం.

70 ఏళ్ల పాటు నడిచిన తగాదాకు త్వరలో తెరపడబోతోంది.