- నిజాంసాగర్ ద్వారాఆన్, ఆఫ్ పద్ధతిలో విడుదల
- షెడ్యూల్ ఖరారు చేసిన ఇరిగేషన్ శాఖ
- ఇప్పటికే నీటిని విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
కామారెడ్డి, వెలుగు: నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ యాసంగిలో ఉమ్మడి జిల్లాలోని 1,25,571 ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లు ఇవ్వనున్నారు. 10.80 టీఎంసీల నీళ్లను ఆరు విడతల్లో ఆన్, ఆఫ్పద్ధతిలో ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. కొద్దిరోజుల విరామంతో ఒక్కో విడతకు నీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ శాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. ఇప్పటికే ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టు నుంచి శుక్రవారం నీటిని అధికారికంగా విడుదల చేశారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు.
వచ్చే వానకాలంలో 6.8 టీఎంసీలు
ప్రాజెక్టు నీటి మట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం1404 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి.17.802 టీఎంసీలగాను ప్రస్తుతం 17,629 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇందులో నుంచి ప్రస్తుత యాసంగి సీజన్‌కు 10.80 టీఎంసీలు విడుదల చేస్తారు. మిగిలిన 6.8 టీఎంసీలు వచ్చే వానకాలంలో వరి నారు పోసుకునేందుకు ఇవ్వనున్నారు. 1,25,571 ఎకరాల ఆయకట్టులో కామారెడ్డి ఇరిగేషన్సీఈ పరిధిలో 92,909 ఎకరాలు, నిజామాబాద్సీఈ పరిధిలో 32,662 ఎకరాలు ఉంది. ఇందులో బాన్సువాడ నియోజకవర్గంలోని మండలాల్లో 78,066 ఎకరాలు, జుక్కల్ లో 3,780 ఎకరాలు, బోధన్‌లో 11,063 ఎకరాలకు నీళ్లు అందనున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నీటి విడుదల ఇలా
ప్రాజెక్టు కింద ఆయకట్టుకు 6 విడతల్లో ఆన్, ఆఫ్పద్దతిలో నీటిని విడుదల చేస్తారు. కొన్ని రోజులు నీటిని విడుదల చేసి, మళ్లీ కొన్ని రోజులు ఆపేస్తారు. తొలి విడత ఈ నెల 27 వరకు, 2వ విడత 07.01.2025 నుంచి 16 వరకు, 3వ విడత 27.01.2025 నుంచి 05.02.2025 వరకు, 4వ విడత 16.02.2025 నుంచి 25.02.2025 వరకు, 5వ విడత 08.03.2025 నుంచి 23.03.2025 వరకు, 6వ విడతలో 03.04.2025 నుంచి 12.04.2025 వరకు నీటి విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్‌శాఖ ఆఫీసర్లు తెలిపారు.
పంటకు అవసరమైన మేర నీటిని ఇస్తాం
ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా పంటల సాగుకు అవసరమైన మేర నీటిని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిలో నుంచి 10.80 టీఎంసీలు ఇస్తాం. ఇంకా ప్రాజెక్టులో 6.8 టీఎంసీల వరకు నిల్వ ఉంటాయి. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. - శ్రీనివాస్, ఇరిగేషన్ సీఈ -కామారెడ్డి జిల్లా