జగిత్యాల మెడికల్‌‌ కాలేజీకి ఎన్‌‌ఎంసీ గ్రీన్‌‌ సిగ్నల్

జగిత్యాల మెడికల్‌‌ కాలేజీకి ఎన్‌‌ఎంసీ గ్రీన్‌‌ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: జగిత్యాల మెడికల్ కాలేజీకి.. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌‌ఎంసీ) పర్మిషన్ ఇచ్చింది. 150 ఎంబీబీఎస్ సీట్లకు లెటర్ ఆఫ్ పర్మిషన్(‌‌ఎల్‌‌వోపీ) ఇస్తూ మంగళవారం‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచే కాలేజీలో అడ్మిషన్లు‌‌ ప్రారంభించుకోవచ్చని చెప్పింది. కాలేజీలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకోవాలని సూచించింది. కాలేజీకి సంబంధించిన అన్ని పనులను, రిక్రూట్‌‌మెంట్లను ఇన్‌‌టైమ్‌‌లో పూర్తి చేస్తామని, నిధులు కేటాయిస్తామని రాష్ట్ర సర్కార్ నుంచి 2 వారాల్లో అండర్‌‌టేకింగ్ పత్రాలు తీసుకుని తమకు సమర్పించాలని‌‌ కాలేజీ ప్రిన్సిపాల్​కు రాసిన లేఖలో పేర్కొంది. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా తొలి దశలో 8 కాలేజీలకు ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర సర్కార్ నిరుడు ఎన్‌‌ఎంసీకి దరఖాస్తు చేసింది. ‌‌ఇందులో జగిత్యాల, రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, సంగారెడ్డి, మహబూబాబాద్, వనపర్తి, నాగర్‌‌కర్నూల్ కాలేజీలున్నాయి. ప్రస్తుతం జగిత్యాల కాలేజీకి పర్మిషన్ వచ్చిందని, మిగిలిన 7 కాలేజీలకూ పర్మిషన్ వస్తుందని డీఎంఈ రమేశ్‌‌రెడ్డి తెలిపారు.