ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: కేజ్రీవాల్‌

ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ఆప్‌ పోటీ చేసే అవకాశాలను ఆ పార్టీ కన్వీనర్‌‌, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉండదని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. మరోవైపు, ఢిల్లీలో లాండ్‌ ఆర్డర్‌‌ సమస్యలు తలెత్తుతున్నాయని, తనపై జరిగిన దాడే ఇందుకు నిదర్శమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేరస్థులపై చర్యలు తీసుకునే బదులు.. ఫిర్యాదుదారులపై కేసులు పెడుతున్నదని మండిపడ్డారు. 

‘‘శనివారం తనపైద్రవంతో ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ద్రవం వల్ల హానీ కలగకపోవచ్చు కానీ, ప్రమాదకరమైనది. గత 35 రోజుల్లో నాపై ఇది మూడో దాడి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నేరుస్థుల కంటే ఫిర్యాదుదారులనే అరెస్ట్ చేయిస్తున్నారు”అని కేజ్రీవాల్‌ ఆరోపించారు. గ్యాంగ్‌స్టర్ల దోపిడీపై గతంలో ఫిర్యాదు చేసిన ఆప్‌ ఎమ్మెల్యే నరేశ్‌ బల్యాన్‌ను కూడా అరెస్ట్‌ చేశారని గుర్తుచేశారు. ఢిల్లీ ప్రజల భద్రతకు హామీ ఇవ్వడంతో పాటు నేరస్థులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.