మెరుస్తున్న సిరిసిల్ల.. బోసిపోయిన కరీంనగర్​

కరీంనగర్ టౌన్, వెలుగు:  తెలంగాణ దశాబ్ది వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు,  పట్టణాలు, గ్రామాలు రెడీ అవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసులు, పబ్లిక్​ ప్లేసుల్లో విద్యుత్​ లైట్ల వెలుగులతో అలంకరించారు. కానీ ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్​లో ఆ ఏర్పాట్లేమీ కనిపించడం లేదు. కలెక్టరేట్​, సిటీలోని బస్టాండ్​ జంక్షన్​, కోర్టు జంక్షన్​, గీతా భవన్​ జంక్షన్లలో ఏర్పాట్లు చేయకపోవడంతో చీకట్లోనే ఉన్నాయి..   అమరవీరుల స్థూపానికి సైతం లైటింగ్​ ఏర్పాటు చేయలేదు. దీంతో సిటీలో దశాబ్ది ఉత్సవాల సందడి కనిపించలేదు. 

పరేడ్​ గ్రౌండ్‌లో వేడుకులకు గంగుల 

దశాబ్ది వేడుకలకు సిటీలోని పరేడ్​ గ్రౌండ్ ముస్తాబైంది. ఉదయం 9 గంటలకు మంత్రి గంగుల కమలాకర్​ జెండా ఆవిష్కరించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించనున్నారు. కలెక్టరేట్, మున్సిపల్ ఆఫీస్, జడ్పీ ఆఫీసుల్లో జెండా ఆవిష్కరణలు చేయనున్నారు. 

అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలి 

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  సిరిసిల్లలో రాష్ట్ర అవతరణ దశాబ్దిఉత్సవాలను  నిర్వహించేందుకు అంతా రెడీ చేశారు. ఇక్కడి వేడుకలకు మంత్రి కేటీఆర్​ హాజరుకానున్నారు. అన్ని వర్గాల ప్రజల దశాబ్ధి వేడుకల్లో పాల్గొనాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు.  జూన్​2 నుంచి 22 వరకు జరిగే ఉత్సవాల్లో తెలంగాణ అభివృద్ధి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్​ చెప్పారు.