SL vs AFG: అతడు క్రికెట్‌కు పనికిరాడు..: ఐసీసీ అంపైర్‌ను దూషించిన హసరంగా

SL vs AFG: అతడు క్రికెట్‌కు పనికిరాడు..: ఐసీసీ అంపైర్‌ను దూషించిన హసరంగా

బుధవారం (ఫిబ్రవరి 21) దంబుల్లా వేదికగా శ్రీలంక- ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య లంక జట్టు 3 పరుగుల తేడాతో పరాజయం పాలవ్వగా.. ఓటమికి అంపైరే కారణమని లంక అభిమానులు ఆరోపిస్తున్నారు. నో బాల్ ఇవ్వడానికి అంపైర్ నిరాకరించడంతోనే తమ జట్టు ఓటమి పాలైందని చెప్తున్నారు. ఈ విషయంలో లంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగా కూడా అంపైర్ తీరును తప్పుబట్టాడు. అతను వేరే జాబ్ చూసుకుంటే మంచిదని సలహా ఇచ్చాడు.

ఏంటి ఈ వివాదం..? ఎందుకీ గొడవ..?   

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో లంకేయులు విజయానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయారు. విజయానికి ఆఖరి ఓవర్‌లో 19 పరుగులు అవసరం కాగా, అనూహ్య పరిణామాల నడుమ ఆఫ్ఘన్ జట్టు విజయం సాధించింది. 

వఫాదర్ మొమాండ్ వేసిన ఆఖరి ఓవర్ నాలుగో బంతి హై ఫుల్ టాస్‌గా వెళ్లగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్‌ నో బాల్‌గా ప్రకటించలేదు. బ్యాటర్ సమీక్ష కోరినప్పటికీ.. కనీసం అతను థర్డ్ అంపైర్ రివ్యూ కూడా కోరలేదు. ఫలితంగా ఆ బాల్‌కు పరుగులేమీ రాకపోవడంతో చివరి రెండు బంతుల్లో విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఫలితం తారుమారయ్యింది. బంతి వికెట్ల మీదుగా వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించినప్పటికీ.. అతను నో బాల్‌గా ప్రకటించకపోవడం లంకేయులను ఆశ్చర్యపరిచింది. 

అంతర్జాతీయ క్రికెట్‌కు సరిపోడు

మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై హసరంగ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అలాంటివి మరోసారి జరగకూడదని తెలిపాడు. బంతి మరి కొంచెం ఎత్తుకు వెళ్లి ఉంటే, అది బ్యాట్స్‌మన్ తలకు తగిలేదని అన్నాడు. స్పష్టంగా నో బాల్ అని కనిపిస్తున్నప్పటికీ, అతను చూడలేకపోయాడంటే.. సదరు అంపైర్ అంతర్జాతీయ క్రికెట్‌కు సరిపోడని వ్యాఖ్యానించాడు. అతను మరో పని చూసుకుంటే మంచిదని సలహా ఇచ్చాడు. ఈ ఘటన అంపైర్ తీరుపై చర్చను రేకెత్తించడమే కాకుండా ప్రస్తుత సమీక్ష పద్ధతిలోని పరిమితులను కూడా హైలైట్ చేస్తోంది.