సామాన్యుల పరిస్థితి ఏంటీ : ఆస్పత్రిలో బెడ్ లేక.. చికిత్స అందక.. మాజీ ఎంపీ కుమారుడు మృతి

సామాన్యుల పరిస్థితి ఏంటీ : ఆస్పత్రిలో బెడ్ లేక.. చికిత్స అందక.. మాజీ ఎంపీ కుమారుడు మృతి

యూపీలో వైద్యం అందక బీజేపీ మాజీ ఎంపీ ప్రసాద్ మిశ్రా కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. తన  కుమారుడు చనిపోవడంతో ఆస్పత్రి ఎదుట ప్రసాద్ మిశ్రా నిరసనకు దిగారు. తన కొడుకు మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది.   రాజకీయనాయకుల కుటుంబాలకే ఇలాంటి పరిస్థితి ఎదురయితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

అసలేం జరిగిందంటే.?  మాజీఎంపీ ప్రసాద్ మిశ్రాకు  ప్రకాశ్ మిశ్రా(41) కొడుకు ఉన్నాడు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. అక్టోబర్ 29 రాత్రి సమస్య తీవ్రమవడంతో లక్నోలోని ఎస్ జీపీజీఐ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేకపోవడంతో ప్రకాశ్ మిశ్రాకు సమయానికి వైద్యం అందలేదు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. 

కళ్ల ముందే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ప్రసాద్ మిశ్రా ఆస్పత్రి ముందు నిరసనకు దిగాడు.  డాక్టర్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన వెంటనే నిరసనను విరమించుకున్నారు. డాక్టర్ల నిర్ల్యం వల్లే తన కొడుకు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు మిశ్రా. తాను నిరసన చేసినప్పుడు చాలా మంది డాక్టర్ పై ఫిర్యాదు చేశారని తెలిపారు.

ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. రోగిని ఎమర్జెన్సీలోకి తీసుకెళ్లాలని డాక్టర్ చెప్పారు కానీ.. ఇలా ఎందుకు జరిగిందో తెల్వదని దీనిపై కమీటీని వేశామని ఆస్పత్రి చీఫ్ డాక్టర్ ఆర్ కే దిమన్ చెప్పారు. 

ఈ ఘటన దుమారం రేగడంతో బీజేపీ ప్రభుత్వంపై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.  ఇది ఆస్పత్రి వైఫల్యం కాదని.. యోగి సర్కార్ వైఫల్యమని ఆరోపించారు.