- జిల్లా ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్‌లో ఓ పాజిటివ్, బి–పాజిటివ్ బ్లడ్ కొరత
- వృథాగా బ్లడ్ కలెక్షన్ వ్యాన్
- ఎన్హెచ్ఎం పై దృష్టి పెట్టని అధికారులు
- బ్లడ్ క్యాంపులు నిర్వహించని స్టాఫ్
మూడు నెలల క్రితం ఓ యువకుడు అనారోగ్యంతో పట్టణంలోని ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని డాక్టర్లు చెప్పారు. దీంతో బంధువులు స్థానిక బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లారు. కానీ అక్కడ ఓ పాజిటివ్ బ్లడ్ అందుబాటులో లేదు. దీంతో వారు ఇతర ఎన్జీఓలు, ఫ్రెండ్స్ సాయంతో బ్లడ్ డోనర్‌ను వెతుక్కున్నారు.
గద్వాల, వెలుగు : జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌లో ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ దొరకడం లేదు. ఓ పాజిటివ్, బి పాజిటివ్ రక్తం అసలే దొరక్కపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీలో బ్లడ్ కొరత లేకుండా చూడాల్సిన నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పని చేయడం లేదు. వీళ్లు జిల్లా వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, రక్తదానం పై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి. నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్‌ను 2018 లో జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రారంభించారు. దీని కోసం మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్‌ను, 5గురు సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. నిత్యం జిల్లా వ్యాప్తంగా తిరిగి గ్రామాల్లో, స్కూళ్లలో, కాలేజీల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించాలి. బ్లడ్ బ్యాంక్‌లో కొరత లేకుండా చూడాలి. కానీ, కేవలం ఆస్పత్రికే పరిమితమైన సిబ్బంది క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీంతో అన్ని గ్రూపుల బ్లడ్ కలెక్షన్ జరగడం లేదు.
లక్షల్లో ఖర్చు..
ఎన్హెచ్ఎం సిబ్బంది జిల్లాలో పర్యటిస్తూ ప్రతిరోజు సుమారు 30 యూనిట్ల బ్లడ్ ను సేకరించాలి. ఆ రక్తాన్ని బ్లడ్ బ్యాంకులో భద్రపరచాలి. దీనికోసం ప్రభుత్వం ప్రతినెలా రూ. లక్షల్లో ఖర్చు చేస్తోంది. జిల్లాలో ఎక్కడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఇతర ఎన్జీఓలు, సంఘాలు నిర్వహించే బ్లడ్ డొనేషన్ క్యాంపులకు వెళ్లి రక్తాన్ని సేకరిస్తున్నారు. ప్రతిరోజు 30 యూనిట్లు బ్లడ్ సేకరించాలని రూల్ ఉన్నా.. దాన్ని సిబ్బంది పట్టించుకోవడం లేదు. రోజూ ఆస్పత్రికి వచ్చి, వెళ్లిపోతున్నారు. బ్లడ్ కలెక్షన్ కోసం ఉన్న వ్యాన్ నిరూపయోగంగా మారింది.
అవసరాన్ని బట్టి క్యాంపులు పెడతాం...
జిల్లాకు అవసరమైన బ్లడ్ యూనిట్లను బట్టి క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్ హెచ్ఎం కింద అప్పాయింట్ అయిన వారు సపరేట్ గా మొబైల్ బ్లడ్ ను కలెక్ట్ చేయడం లేదు. ఎక్కువ అవసరం ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాం.
- డాక్టర్ నవీన్ క్రాంతి,బ్లడ్ బ్యాంక్ ఇన్ చార్జి