గుళ్ల పూజారులే సమర్పిస్తరు
8 నుంచి ఆలయాల్లో దర్శనాలు షురూ
కంటైన్‌మెంట్ జోన్లలో గుడులు తెరవరు
శఠగోపం, తీర్థ ప్రసాదాలు, వసతి ఉండవు
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కరోనా కారణంగా రాష్ట్రంలో ఈ సారి బోనాలు వేడుకగా నిర్వహించడం లేదు. పూజారులే అమ్మ వార్లకు బోనాలు సమర్పిస్తారు. ఈ నెల 8 నుంచి ఆలయాల్లో దర్శనాలు ప్రారంభం కానుండడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా క్యూలైన్లు రెడీ అవుతున్నాయి.
హైదరాబాద్, వెలుగు: కరోనా కారణంగా రాష్ట్రంలో ఈ సారి బోనాలు నిర్వహించడం లేదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కావాల్సిన గోల్కోండ బోనాలు, జులై 12న సికింద్రాబాద్ మహంకాళి, 19న హైదరాబాద్ బోనాలు ఉండవని పేర్కొన్నారు. ఆయా గుడుల పూజారులే అమ్మ వార్లకు బోనాలు సమర్పిస్తారన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆలయాలు తెరవడానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (ఎస్‌ఓపీ)పై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 8వ తేదీ నుంచి గుడుల్లో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. క్యూలైన్లలో ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని, సోడియం హైపోక్లోరైడ్‌తో గుడి ఆవరణ కడగాలని, ఎంట్రీలోనే శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని, థర్మల్ స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం గుడులు ఓపెన్ కావని చెప్పారు.
పిల్లలు, వృద్ధులు రావొద్దు
కోనేర్లలో స్నానాలకు అనుమతి లేదని, అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థ ప్రసాదాల వితరణ, వసతి సౌకర్యాలు ఉండవని మంత్రి పేర్కొన్నారు. ఆలయాల వద్ద ఉన్న షాపుల నుంచి ప్రసాదాలు పొందొచ్చన్నారు. ప్రముఖ దేవాలయాలకు సంబంధించి ఆన్‌లైన్ బుకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 65 ఏండ్లపైబడిన వారు, 10 ఏండ్లలోపు పిల్లలు, కరోనా లక్షణాలు ఉన్నవారు ఆలయ దర్శనాలకు రావొద్దని సూచించారు. సమీక్షలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
For More News..