మార్కెట్ కమిటీలకు పాలకులు లేరు 

  • మంత్రి కేటీఆర్​ ఇలాఖాలో ఆరు నెలలుగా ఐదు ఏఎంసీలకు చైర్మన్​ సీట్లు ఖాళీ 
  • అసంతృప్తి వస్తుందని హోల్డ్ ‌‌లో పెట్టిన పార్టీ పెద్దలు 
  • మంత్రి కేటీఆర్​ ఓకే అంటేనే చైర్మన్​ పదవుల భర్తీ

రాజన్న సిరిసిల్ల,వెలుగు: జిల్లాలో వ్యవసాయ మార్కెట్లలో చాలావాటికి చైర్మన్లు లేక పాలన కుంటుపడుతోంది. జిల్లాలో 13 మండలాలకు తొమ్మిది వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా అందులో వేములవాడ నియోజకవర్గంలో నాలుగు, మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో ఐదు వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. గతేడాది డిసెంబర్ లో జిల్లాలో ఉన్న 8 ఏఎంసీల పాలకవర్గాల గడువు ముగిసింది. అయితే  వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ, రుద్రంగి, ఇల్లంతకుంట, బోయిన్ ‌‌పల్లి ఏఎంసీలకు చైర్మన్​పదవులు భర్తీ చేశారు. మరోవైపు సిరిసిల్ల నియోజకవర్గంలో భారీగా ఆశావహులు ఉండడంతో పార్టీలో అసంతృప్తి చెలరేగే అవకాశం ఉందని ఇక్కడి ఐదు ఏఎంసీల నియామకాలను హోల్డ్ ‌‌లో పెట్టారు. తాజాగా వీటిని కూడా భర్తీ చేసేందుకు రెండు మూడు రోజులుగా కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం. 

పాలన భారం ఇన్ ‌‌చార్జులదే.. 

ఆరునెలలుగా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఐదు ఏఎంసీలను ఇన్ ‌‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. నాలుగు ఏఎంసీలకు జగిత్యాల డీఎంవో ప్రకాశ్ ‌‌ పర్సన్ ‌‌ ఇన్ ‌‌చార్జ్ ‌‌గా వ్యవహరిస్తున్నారు. ఆయా ఏఎంసీల సెక్రటరీలు మార్కెట్ కమిటీల నిర్వహణను చూసుకుంటున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, వీర్నపల్లి ఏఎంసీలకు హరినాథ్, సిరిసిల్ల ఏఎంసీకి సత్యనారాయణ, ముస్తాబాద్ మండలం పోతుగల్, గంభీరావుపేట ఏఎంసీలకు ఇంద్రసేనారెడ్డి సెక్రటరీలుగా వ్యవహరిస్తున్నారు. 

కేటీఆర్ వద్దకు లిస్ట్ 

సిరిసిల్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలతోపాటు కొత్త  మండలం వీర్నపల్లికి కూడా  వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ మార్కెట్ కమిటీలు కొలువుదీరనున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి కేటీఆర్ వద్దకు ఐదు మండలాలకు సంబంధించిన లిస్ట్ చేరినట్లు సమాచారం. త్వరలో ఏఎంసీలకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతాయని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  మరోవైపు  ఉద్యమంలో పనిచేసినవారు, ఇతర పార్టీల నుంచి వచ్చినవారు ఈ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా పార్టీలో, ప్రభుత్వంలో ఎలాంటి పదవులు దక్కకపోవడంతో వీరు కొంత అసంతృప్తిలో ఉన్నారు.  గతేడాది డిసెంబర్ లో ఏఎంసీల పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతాయని ప్రచారం జరిగింది. దీంతో బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ వద్ద క్యూ కట్టారు. జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆశావహులు ఎక్కువ ఉండడంతో అప్పుడు పదవుల భర్తీని హోల్డ్ ‌‌లో పెట్టినట్లు సమాచారం. 

భారీగా ఆశావహులు 

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉండడంతో ఏఎంసీ పాలకవర్గాలను నియమించే అవకాశం ఉంది. కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. అయితే చైర్మన్​పదవులను ఆశించివారి లిస్ట్​భారీగా ఉంది. ఒక్కో పోస్ట్ ‌‌కు మూడు నుంచి ఆరుగురు వరకు పోటీపడుతున్నారు. ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపల్లి సురేందర్ రావు, కాంగ్రెస్ నుంచి అధికార పార్టీలోకి వచ్చిన చిట్నేని అంజన్ రావు, గుర్రాల రమేశ్ ‌‌ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంది. గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్​గిరికి ఆరుగురు ప్రయత్నిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నుంచి మాజీ ఎంపీపీ ఎల్సాని మోహన్, కొండా రమేశ్, నర్సింహారెడ్డి, పులి రమేశ్​ ఇప్పటికే మంత్రి కేటీఆర్ ‌‌ ‌‌ను కలిశారు. వీర్నపల్లికి పెద్దగా పోటీ లేకున్నా కేటీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.  వారంలో చైర్మన్​పదవులు భర్తీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.