రిపబ్లిక్​డే పరేడ్లో తెలంగాణ శకటానికి నో చాన్స్

రిపబ్లిక్​డే పరేడ్లో తెలంగాణ శకటానికి నో చాన్స్
  • రామప్ప, రుద్రమదేవి, అడ్వాన్స్​డ్ ట్రైనింగ్ సెంటర్ థీమ్లతో నమూనాలు 
  • మూడో రౌండ్లో తిరస్కరించిన కేంద్ర కమిటీ

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో శకటాన్ని ప్రదర్శించేందుకు తెలంగాణకు అవకాశం దక్కలేదు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే నమూనాలను పరిశీలించి, శకటాలను ఎంపిక చేసే సెరెమోనియల్ కమిటీ మూడో రౌండ్ లోనే తెలంగాణ శకటాన్ని తిరస్కరించింది. ఈసారి జనవరి 26 వేడుకల్లో ‘డెవలప్ మెంట్ అండ్ ట్రెడిషన్’ థీమ్ తో శకటాలను ప్రదర్శించాలని నిర్ణయించామని, ఇందులో పాల్గొనేందుకు శకటాల నమూనాలను పంపాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని సెరెమోనియల్ కమిటీ గత నెలలో సమాచారం ఇచ్చింది.

దీంతో శకటాలను ప్రదర్శించేందుకు తెలంగాణ, ఏపీతో సహా 29 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు అప్లై చేసుకున్నాయి. తెలంగాణ నుంచి రామప్ప దేవాలయం, రాణి రుద్రమ దేవి, అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్ థీమ్ లతో రూపొందించిన నమూనాలతో రాష్ట్ర ప్రభుత్వ ఐ అండ్ పీఆర్ అధికారులు కమిటీ రెండు మీటింగ్ లకు హాజరయ్యారు.

తొలుత రుద్రమదేవి థీమ్కు కొంత సానుకూలంగా స్పందించిన కమిటీ.. తాజా డెవలప్ మెంట్ ను కూడా జోడించాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో ఏడాది పాలన, ఇతర అభివృద్ధి అంశాలను జోడించిన నమూనాతో అధికారులు మూడో మీటింగ్ కు హాజరయ్యారు. కానీ ముందు నుంచే రాష్ట్ర శకటం నమూనాలపై అసంతృప్తితో ఉన్న కమిటీ ఈసారి తెలంగాణ అప్లికేషన్ ను రిజెక్ట్ చేసింది. అందుకే ఈ నెల 5వ తేదీన కమిటీ నాలుగో మీటింగ్ కు ఆహ్వానం పంపలేదని అధికారులు తెలిపారు. అయితే, ఎర్రకోట ప్రాంగణంలో జరిగే భారత్ పర్వ్ లో మాత్రం మన శకటాన్ని ప్రదర్శించేందుకు అవకాశం ఉందని చెప్పారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కాగా, రిపబ్లిక్ డే శకటాలకు సంబంధించి ఇప్పటివరకు ఏపీ(ఎడికొప్ప బొమ్మల థీమ్)తో పాటు 24 రాష్ట్రాలు నాలుగో మీటింగ్ వరకు అర్హత సాధించాయి. 
  
గతేడాది సీఎం రేవంత్ చొరవతో చాన్స్..
గతేడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం నుంచి శకటం నమూనాను పంపేందుకు అవకాశం దక్కలేదు. దీంతో కర్తవ్య పథ్ పై తెలంగాణ శకటాన్ని ప్రదర్శించేలా చూసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. రాష్ట్ర పోరాట పటిమ, చరిత్రను చాటేందుకు అవకాశం ఇవ్వాలని రక్షణ శాఖకు విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తి మేరకు రాష్ట్ర శకట నమూనాను పరిశీలించిన సెరెమోనియల్ కమిటీ ఓకే చెప్పింది. అలా గతేడాది ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ థీమ్ తో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించింది. అయితే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మూడు సార్లు మాత్రమే రాష్ట్ర శకటాన్ని ప్రదర్శించేందుకు అవకాశం దక్కింది.