- వరంగల్, హన్మకొండ జిల్లాలపై నో క్లారిటీ
- సీఎం చెప్పి 20 రోజులవుతున్నా సర్కారు నుంచి ఉత్తర్వులు రావట్లే
- మండలాల మార్పుచేర్పులపై రోజుకో లీకు ఇస్తున్న ప్రజాప్రతినిధులు
- సిటీ జనాల్లో అయోమయం
- తాజాగా తెరపైకి పరకాల జిల్లా డిమాండ్
వరంగల్ రూరల్/పరకాల, వెలుగు: వరంగల్లో జిల్లాల పేర్ల మార్పుపై అయోమయం కొనసాగుతోంది. ప్రస్తుత వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారుస్తామని చెప్పిన అధికార పార్టీ నేతలు, రోజుకో మాట మాట్లాడుతుండడంతో అసలేం జరుగుతుందో అర్థం కాక పబ్లిక్ తలలు పట్టుకుంటున్నారు. జిల్లాల పేర్లు మారుస్తామనే సాకుతో లీడర్లు తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఇష్టారీతిన మండలాలు ఇటూ అటూ మారుస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మొదట్లో హన్మకొండ జిల్లాలో.. ప్రస్తుత రూరల్ జిల్లాలోని రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలు కలుస్తున్నాయనే లీకులు రాగా.. వారం నుంచి ఇదే జిల్లాలోని రెవెన్యూ డివిజన్ పరకాల, నడికుడ, దామెర మండలాలను చేర్చబోతున్నట్లు కొందరు లీడర్లు చెబుతున్నారు. కాగా, ఇదే విషయాన్ని పరకాలలో జరిగిన ఓ ప్రెస్మీట్లో శుక్రవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు.
రెండ్రోజుల్లో అన్నరు.. 20 రోజులు గడిచె
జూన్ 21న సీఎం కేసీఆర్ వరంగల్ సిటీ పర్యటనలో జిల్లాల పేర్లు మార్చుతామని ప్రకటించారు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ప్రాంతాన్ని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ పేర్లతో పిలవడం బాగాలేదని.. జనాలు, లీడర్లు సైతం ఇదే విషయాన్ని తన దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. అర్బన్, రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా పేర్లు మార్చబోతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామన్నారు. ఆపై..మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు గత నెల 30న మరోమారు ఈ టాపిక్ తీసుకొచ్చారు. వారంలోగా జిల్లాల మార్పుకు సంబంధించి ఉత్తర్వులు వస్తాయన్నారు. తీరా చూస్తే.. ఇద్దరూ చెప్పిన గడువు ముగిసింది తప్పితే జిల్లాల పేర్ల మార్పు విషయంలో ఎటువంటి ఉత్తర్వులు రాలేదు.
పరకాల.. హన్మకొండ జిల్లాలోకే అంటున్న చల్లా
ఉమ్మడి జిల్లాలో కొత్తగా పేరు మారనున్న హన్మకొండ జిల్లాలోకి.. ప్రస్తుత రూరల్ జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ పరకాల, నడికుడ, దామెర మండలాలు చేరనున్నాయి. ఇదే విషయాన్ని అక్కడి నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. గత నెల సీఎం వరంగల్ సిటీ వచ్చివెళ్లాక.. హన్మకొండ జిల్లాలోకి మంత్రి దయాకర్‍రావు నియోజకవర్గ పరిధిలోని రాయపర్తితో పాటు రూరల్ జిల్లాలోని వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలను చేర్చుతామనే లీకులు ఇచ్చారు. దీనికి ఆ ప్రాంత ఎమ్మెల్యే అరూరి రమేశ్ సైతం ఓకే చెప్పారు. అర్బన్ జిల్లాలోని వరంగల్, ఖిలా వరంగల్ ప్రస్తుత రూరల్ జిల్లాలోకి వెళతాయని మాట్లాడారు. తర్వాత ఏమైందో ఏమోకానీ హన్మకొండ జిల్లాలోకి ఒక్కసారిగా చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గ హెడ్‍క్వార్టర్ పరకాల, నడికుడ, దామెర మండలాల పేర్లు వచ్చాయి. శుక్రవారం పరకాలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఇదే విషయంపై ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. తన నియోజకవర్గంలోని మూడు మండలాలు అర్బన్ పరిధిలోని హన్మకొండ జిల్లాల్లో కలుస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. పరకాల రెవెన్యూ డివిజన్‍లోకి కొత్తగా కమలాపూర్‍తో పాటు మరో రెండు మండలాలు చేర్చేలా కలెక్టర్ ఇతర ఆఫీసర్లు ఆలోచన చేసినట్లు చెప్పారు.
పరకాలపై ప్రతిపక్షాల పోరాటం
పరకాల రెవెన్యూ డివిజన్ కొత్త హన్మకొండ జిల్లాలో కలుపుతున్నారనే విషయం నియోజకవర్గ కేంద్రంలో గత వారం పది రోజులుగా హాట్ టాపిక్ అయింది. ఎంతో చరిత్ర ఉన్న పరకాలను అర్బన్ జిల్లాలో కలపొద్దని.. రూరల్ జిల్లా కేంద్రంగా మార్చడమో లేదంటే కొత్తగా అమరవీరుల జిల్లా చేయాలనే డిమాండ్‍తో ప్రతిపక్షాలు ముందుకు వెళుతున్నాయి. పరకాల ప్రాంతాన్నిఅభివృద్ధి చేయలేక ఎమ్మెల్యే ధర్మారెడ్డి సరికొత్త కుట్ర చేస్తున్నట్లు బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. పరకాల డివిజన్‍కు అన్యాయం జరిగితే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ లీడర్లు పరకాలను ఎట్టి పరిస్థితుల్లో హన్మకొండ జిల్లాలో కలపొద్దని చెబుతున్నారు. పరకాల జిల్లా కేంద్రం విషయంలో ఎమ్మెల్యే తన హామీని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. పరకాల రెవెన్యూ డివిజన్‍ను సపరేట్ జిల్లా చేయాలని స్థానిక ఆర్డీవోకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కాగా, నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా చల్లా పరకాలను వదిలి గీసుగొండ కేంద్రంగా కొత్త నియోజకవర్గానికి కసరత్తు చేస్తున్నాడని.. అందువల్లే పరకాల ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎక్కువవుతున్నాయి.