రోజుకో చోట రోడ్డెక్కుతున్న రైతులు
నూరో నూటయాభయో ఎక్కువిస్తామన్న సీఎం
మార్కెట్‌కు వస్తున్న వడ్లు.. అమలు కానీ హామీ
కామన్ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి
క్వింటాల్‌కు రూ. 2,500 ఇవ్వాలని రైతుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: దొడ్డు వడ్ల కన్నా సన్న వడ్లకు నూరో నూటయాభై రూపాయలో ఎక్కువ ధర ఇప్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా.. ఇంకా దానిపై తుది నిర్ణయానికి రాలేదు. దీంతో ధాన్యాన్ని మార్కెట్‌కు తెస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతున్నది. అగ్గువ సగ్గువకే వడ్లను అమ్ముకోవాల్సి వస్తున్నది. ఇప్పటికే భారీ వర్షాలు, దోమపోటుతో తీవ్రంగా నష్టపోయామని, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సన్న వడ్లను పండించాలంటూ గతంలో సీఎం చేసిన సూచనతో రైతులు వాటిని పండించారు. ఎక్కువగా నల్గొండ, కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో సాగు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లోని ధరల వల్ల గిట్టుబాటు కావడం లేదు. ఇటీవల వడ్ల సేకరణ, కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించి సవరించిన ఎంవోయూ వివరాలను సెంట్రల్ కన్జ్యూమర్స్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ జైప్రకాశ్ రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కమిషనర్‌కు లెటర్ రాశారు. కేంద్రం నిర్దేశించిన ధాన్యం కన్నా ఎక్కువ సేకరించినా, ఎంఎస్‌పీకి అదనంగా ఎలాంటి బోనస్ ప్రకటించినా అది సెంట్రల్ పూల్ పరిధిలోకి రాదన్నారు. దీంతో సీఎం చెప్పిన.. సన్న వడ్లకు బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉం టుంది. మార్కెట్‌కు సన్న వడ్లు వస్తున్నా ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా సీఎం ఇస్తామన్న బోనస్ కూడా ఏ మూలకు సరిపోదని చెప్తున్నారు.
క్వింటాల్‌కు రూ. 2,500 ఇస్తేనే గిట్టుబాటు
రాష్ట్రంలో తెలంగాణ సోనా, సాంబా మసూరి, ఇతర సన్న రకాల వడ్లన్నీ ఈ సీజన్లో 29 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలకు పంట దెబ్బతిన్నది. దోమకాటు తెగుళ్లతో మరింత నష్టం వాటిల్లింది. పంట దెబ్బతినడంతో ఏం చేయాలో తెలియక పలు చోట్ల రైతులు పంటకు నిప్పు పెట్టారు. మరోవైపు మార్కెట్లో సన్న రకాల వడ్లకు సరైన ధర రావడం లేదు. గతంలో బహిరంగ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.2,500 వరకు అమ్ముడుపోయేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. సన్న రకం వడ్లు పండిస్తే.. ఎకరానికి 21 నుంచి 24 క్వింటాళ్ల లోపే దిగుబడి వస్తుంది. పైగా మందులకు ఖర్చు ఎక్కువ. దీంతో పెట్టుబడి పెరిగి, ఆదాయం తగ్గి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో గ్రేడ్–1 వడ్లకు రూ. 1,888, కామన్ రకానికి రూ. 1,868 మద్దతు ధర ఇస్తున్నారు. సన్న వడ్లకంటూ ప్రత్యేక ధర ఏదీ నిర్ణయించలేదు. కామన్ ధరలతోనే సన్నవడ్లను కొంటున్నారు. సీఎం హామీ మేరకు వంద రూపాయలు పెరిగినా.. రూ.1,988 వస్తుంది. రూ.150 పెరిగితే రూ. 2,038 వస్తుంది. సన్నవడ్లకు క్వింటాల్‌కు కనీసం రూ. 2,500 మద్దతు ధర ఇస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెప్తున్నారు.
58 లక్షల టన్నుల అంచనా
ఈ సీజన్లో రాష్ట్రంలో 58 లక్షల టన్నుల సన్న వడ్లు దిగుబడి రావొచ్చని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో 50 లక్షల టన్నుల సన్న వడ్లకు సీఎం చెప్పినట్లు రూ. 100 బోనస్ ఇస్తే అదనంగా రూ. 500 కోట్లు, రూ.150 బోనస్ ఇస్తే అదనంగా రూ. 750 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆఫీసర్లు అంటున్నారు.