- దళిత బంధు లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్ల ద్వారా చేపడుతామని మార్చిలో ప్రకటన
- ఇప్పటికీ గైడ్‌లైన్స్ రిలీజ్ చేయలే
- మొదటి విడతలో ఇంకా 10 వేల యూనిట్ల పెండింగ్!
- సప్పుడు చేయని రాష్ట్ర సర్కారు
పెద్దపల్లి, వెలుగు: దళితబంధు రెండో విడత అమలుపై రాష్ట్ర సర్కారు సప్పుడు చేయడం లేదు. త్వరలోనే అమలు చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ప్రకటించారు. 2023- – 24 ఆర్థిక ఏడాదికి ఒక్కో సెగ్మెంట్‌కి 1,100 మందికి దళితబంధు యూని ట్లు ఇస్తామని, రాష్ట్రంలో సీఎస్ఆధ్వర్యంలో అద నంగా 200 మందికి ఈ స్కీమ్ వర్తింపజేస్తామని మార్చిలో జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రి హరీశ్ చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలో కలెక్టర్ల ద్వారా చేపడుతామ ని ప్రకటించారు. కానీ ఇప్పటికీ గైడ్‌లైన్స్ ఇవ్వలేదు. గతంలో లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలే చేయడంతో అక్రమాలు జరిగాయంటూ చాలా చోట్ల దళితులు ఆందోళనలు చేశారు. లబ్ధిదారుల నుంచి కొందరు ఎమ్మెల్యేలు రూ.3లక్షల దాకా వసూలు చేసినట్టు సమాచారం ఉందని కేసీఆర్ స్వయంగా బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో చెప్పడంతో ఆరోపణలు నిజమని తేలింది. ఈ నేపథ్యంలో మొదటి విడత జరిగినట్టే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందా? జిల్లా కలెక్టర్ల ద్వారాఎంపిక చేస్తారా? అనే దానిపై క్లారిటీ లేదు.
ఇంకా మొదటి విడతే పూర్తి కాలే
హుజూరాబాద్ ఉప ఎన్నిక టైమ్‌లో దళితబంధు స్కీమ్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి నచ్చిన వ్యాపారం చేసుకునేందుకు వీలుగా రూ.10 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18 లక్షల దళిత కుటుంబాలు ఉండగా, దశల వారీగా 1.80 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం చెప్పారు. మొదటి విడతలో గతేడాది హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు మరో నాలుగు మండలాల్లో పూర్తి స్థాయిలో, మిగిలిన118 నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున మొత్తం 40 వేల మందికి దళితబంధు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటిదాకా 30 వేల యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఇంకా 10 వేలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధు అమలు కోసం సర్కారు బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించింది. ఆన్‌లైన్‌లో దళితుల నుంచి అప్లికేషన్లు తీసుకొని జిల్లా కలెక్టర్ల ద్వారా రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ రెండో విడత సంబంధించి ఇంతవరకు గైడ్‌లైన్స్ రిలీజ్ కాలేదు. దీంతో అధికారులు అప్లికేషన్లు తీసుకోవడం లేదు.
గైడ్‌లైన్స్ ఇయ్యాలె
దళితబంధు రెండో విడత పంపిణీకి సంబంధించిన గైడ్‌లైన్స్ వెంటనే రిలీజ్ చేయాలె. గతంలో మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా దళితబంధును అర్హులకు అందించాలి.
- ఆరెపల్లి రాకేశ్, ఎస్సీ పరిరక్షణ సమితి,పెద్దపల్లి
మొదటి విడతలో అక్రమాలు
దళితబంధు మొదటి విడతలో అక్రమాలు చోటుచేసుకున్నయి. అధికార పార్టీ కార్యకర్తలకే లబ్ధి జరిగింది. రెండో విడత ఎంపిక పారదర్శకంగా జరగాలె. ఆన్లైన్ విధానంలో ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా అర్హులను ఎంపిక చేయాలె.
- కాడే సూర్యనారాయణ, బీజేపీ దళితమోర్చా, స్టేట్ స్పోక్స్ పర్సన్