మక్క పంట చేతికొచ్చినా స్పందించని సర్కారు

మక్క పంట చేతికొచ్చినా స్పందించని సర్కారు
  • కొనుగోళ్లపై గత మూడేళ్లుగా నిర్లక్ష్యమే
  • 10.37 లక్షల టన్నుల దిగుబడి అంచనా
  • మార్కెట్‌‌లో మద్దతు ధర దక్కడంలే
  • మార్క్‌‌ఫెడ్‌‌ కొంటే అయ్యే ఖర్చు వెయ్యి కోట్లే

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట చేతికి వస్తోంది. కానీ మక్క కొనుగోళ్లపై సర్కారు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. మద్దతు ధరతో మార్క్‌‌ఫెడ్‌‌ ద్వారా మక్కలు కొని రైతులకు అండగా నిలవాల్సిన సర్కారు.. గత మూడేళ్లుగా నిర్లక్ష్యం చేస్తోంది. ఈ వానాకాలం కొన్ని ప్రాంతాల్లో పంట చేతికి రాగా మరికొన్ని ప్రాంతాల్లో పంట చివరి దశలో ఉంది. చేతికి వచ్చిన మక్కలను అమ్మేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సర్కారు మక్కలు కొంటుందా లేదా అనేది తేల్చకపోవడంతో  గందరగోళం కొనసాగుతోంది. ఈయేడు వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 6.21 లక్షల ఎకరాల వరకు మొక్కజొన్న పంట సాగైంది. ఎకరానికి 16.71 క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సాగైన పంట దిగుబడి 10.37 లక్షల టన్నుల వరకు ఉంటుందని మార్కెటింగ్‌‌ శాఖ భావిస్తోంది. గత మూడేళ్లుగా మక్కలు వద్దన్న సర్కారు.. వానాకాలం సీజన్‌‌ ప్రారంభంలో ఈ పంట వేయాలని కానీ, వద్దని కానీ చెప్పలేదు. దేశవ్యాప్తంగా మక్కల సాగు సరిగా లేకపోవడంతో రాష్ట్రంలో పండిన మక్కలను సర్కారు కొంటుందని రైతులు ఆశతో ఉన్నారు. బాయిల్డ్‌‌ రైస్‌‌ విషయంలో కేంద్రంపై విమర్శలు చేస్తున్న కేసీఆర్‌‌  సర్కారు.. రాష్ట్రంలో పండే మక్కలు కొనాల్సి ఉన్నా ఎందుకు కొనడం లేదో స్పష్టం చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. 

రైతుకు దక్కని మద్దతు

రాష్ట్రంలో ఈ సీజన్‌‌లో మొక్కజొన్నల దిగుబడి అంచనా 10.37 లక్షల టన్నుల్లో కనీసం సగం పంటనైనా కొనాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. మార్క్‌‌ఫెడ్‌‌ ద్వారా 5 లక్షల టన్నుల మక్కల కొనుగోలుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మక్కలకు మద్దతు ధర రూ.1962 ఉంది.  బహిరంగ మార్కెట్‌‌లో మద్దతు ధర కన్నా ఎక్కువకే కొంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. కానీ వారు తక్కువ ధరకే మక్కలు కొంటున్నారని రైతులు పేర్కొంటున్నారు. బుధవారం నిజామాబాద్‌‌ మార్కెట్‌‌లో మక్కను క్వింటాల్ కు కనిష్ట ధర  రూ.1409కు కొన్నారు. దీంతో తమకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు చెబుతున్నారు. సర్కారు మక్కలు కొనకపోతే ఇబ్బంది తప్పదని ఆందోళన చెందుతున్నారు.

మార్క్‌‌ఫెడ్‌‌ కొంటే అయ్యే ఖర్చు వెయ్యికోట్లే

రాష్ట్ర సర్కారు మద్దతు ధరతోమార్క్‌‌ఫెడ్‌‌ ద్వారా మక్కలు కొంటే రూ.1000 కోట్లు అవసరం అవుతాయి. ఖర్చులన్నీ కలుపుకున్నా ఈ వానాకాలం సీజన్‌‌లో మక్కల కొనుగోళ్లకు రూ.1200 కోట్లకు మించి అయ్యే అవకాశం లేదు. సర్కారు చేసే ఖర్చు పెద్దగా లేకపోయినా మక్కల కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంతో గత మూడేళ్లుగా దళారులకు, ప్రైవేటు వ్యాపారులకు అగ్గువకు అమ్ముకుని రైతులు నిండా 
మునుగుతున్నారు. 

వడ్లు కొంటున్న సర్కారు మక్కలెందుకు కొంటలే?

రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లకు వేలకోట్లు ఖర్చు పెడుతోంది. కానీ వెయ్యి కోట్లు ఖర్చుచేసి  మక్కలు కొనేందుకు వెనకడుగు వేస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు ఆధ్వర్యంలోని సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నోడల్‌‌ ఏజెన్సీగా మాత్రమే వ్యవహరిస్తుంది. దీనికయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కానీ మక్కలు కొంటే అయ్యే ఖర్చుకు బ్యాంకు గ్యారంటీని రాష్ట్ర సర్కారే ఇవ్వాల్సి ఉంటుంది. తిరిగి అమ్మితే వచ్చే నష్టం రాష్ట్ర సర్కారే భరించాల్సి ఉంటుంది. అందుకే  మక్కలను పక్కన పెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.