
వెలుగు, స్పోర్ట్స్ డెస్క్: చాంపియన్స్ ట్రోఫీలో తిరుగులేని ఆటతో ఆకట్టుకున్న టీమిండియా మూడోసారి టైటిల్ నెగ్గి తన తడాఖా చూపెట్టింది. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లోనూ ఇండియాకు ఐసీసీ ట్రోఫీ అందించాడు. కెప్టెన్‌గా రెండు, మొత్తంగా నాలుగు ఐసీసీ టైటిళ్లు ఖాతాలో వేసుకొని ధోనీ తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మన్ననలు అందుకుంటున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని రోహిత్ స్పష్టం చేశాడు. తాను ఇప్పటికిప్పుడు ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావడం లేదని, ఎవరూ పుకార్లు వ్యాప్తిచేయవద్దని చెప్పడంతో అతని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
కానీ, ఇంతలోనే 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడేది..? లేనిది..? ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు. దాంతో ఈ ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్ ఫ్యూచర్‌పై క్లారిటీ లేకుండా పోయింది. రోహిత్ వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు వన్డేల్లో కొనసాగాలని తనకెంతో ఇష్టమైన, మంచి రికార్డు ఉన్న ఈ ఫార్మాట్‌లో ఇండియాను వరల్డ్ చాంపియన్‌గా నిలిపిన తర్వాతే వీడ్కోలు చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. సౌతాఫ్రికా ఆతిథ్యం ఇచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ ఇంకా దూరంలో ఉంది. అప్పటికి హిట్‌మ్యాన్ వయసు 40 ఏండ్లకు చేరుకుంటుంది. అయితే, గ్రౌండ్‌లో సత్తా చాటుతూ.. పరుగులు చేస్తున్నంత కాలం తనకు వయసు ఆటంకం కాబోదు.
టెస్టులు ముగిస్తాడా..?
వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకునే ఆలోచన లేదని రోహిత్ స్పష్టం చేయడంతో తను టెస్టులకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందా అనే చర్చ కూడా మొదలైంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ షార్ట్ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. అప్పుడు వన్డేలు, టెస్టులు ఆడుతూనే ఉంటానని తెలిపాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్నప్పటి నుంచి రోహిత్ టెస్టుల్లో ఇండియా జట్టును నడిపిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్, బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో తడబడినా.. కొన్నేండ్లుగా టెస్టు ఫార్మాట్‌లో టీమ్ బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా ఉన్నాడు.
2021లో ఓవల్‌లో ఇంగ్లండ్‌పై తన కెరీర్ బెస్ట్ సెంచరీ కొట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఐపీఎల్‌తో హిట్‌మ్యాన్ బిజీగా కానున్నాడు. జూన్‌లో ఇంగ్లండ్‌తో సిరీస్‌తో కొత్త వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభం కానుంది. వయసు, పనిభారం దృష్టిలో ఉంచుకొని రోహిత్ టెస్టుల నుంచి తప్పుకొనే ఆలోచన చేయొచ్చు. అదే జరిగి ఒకవేళ వన్డేల్లోనే కొనసాగాలని అనుకుంటే మాత్రం వచ్చే వరల్డ్ కప్ నాటికి అతను 9 సిరీస్‌ల్లో గరిష్టంగా 27 ఇంటర్నేషనల్ వన్డేల్లో పాల్గొంటాడు. అప్పుడు 2027 వరల్డ్ కప్ ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.
అప్పటిదాకా ఉండాల్సిందే..
ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో ఇండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా.. రోహిత్ వన్డే, టెస్టుల్లో జట్టును నడిపిస్తున్నాడు. అతని గైర్హాజరీలో టెస్టు జట్టును నడిపించిన సందర్భాల్లో జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా తన మార్కు చూపెట్టాడు. కానీ, ఫిట్‌నెస్ సమస్యలు, తరచూ గాయాలకు గురవుతున్న కారణంగా అతనికి పూర్తి స్థాయి పగ్గాలు అప్పగించే విషయంలో సెలెక్టర్లు, బోర్డు పెద్దలు ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. అదే సమయంలో కొత్త తరం ఆటగాళ్లలో జట్టును నడిపించే సత్తా ఉన్న వాళ్లలో శుభ్‌మన్ గిల్ ముందున్నాడు. ఇప్పటికే వన్డేల్లో అతనికి వైస్ కెప్టెన్సీ అప్పగించారు. అయితే గిల్‌ను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దేందుకు సెలెక్టర్లకు మరింత సమయం పట్టనుంది.
ఈ నేపథ్యంలో రోహిత్ అనుభవం జట్టుకు ఎంతో అవసరం కానుంది. విరాట్ కోహ్లీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘మేము మంచి భవిష్యత్తు ఉన్న జట్టును సిద్ధం చేశాం. కానీ దీన్ని మంచి చేతుల్లో పెట్టాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది’ అని చెప్పాడు. ప్రస్తుతం ఇండియా క్రికెట్ టీమ్‌లో క్రమంగా మార్పులు జరుగుతున్నాయి. కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చి తమ సత్తా నిరూపించుకుంటున్నారు. ఈ సమయంలో నమ్మకమైన నాయకుడిగా రోహిత్ సేవలు జట్టుకు అవసరం. తన వారసుడిగా భావించే మరో సమర్థుడు తయారయ్యే వరకూ హిట్‌మ్యాన్ కొనసాగడమే జట్టుకు మంచిది. అది 2027 వరల్డ్ కప్ వరకూ అయితే ఇంకా బాగుంటుంది.
భవిష్యత్తు గురించి చాలా ముందుగానే ఆలోచించడం సరికాదు . ప్రస్తుతం నా దృష్టి బాగా ఆడడంపై, సరైన మైండ్‌సెట్‌ను కొనసాగించడంపైనే ఉంది. నేను 2027 వరల్డ్ కప్ ఆడతానా లేదా అన్నది ఇప్పుడే నిర్ణయించాలనుకోవడం లేదు. నా కెరీర్‌ను ఎప్పుడూ ఒక్కో దశగా ముందుకు తీసుకెళ్లాను. భవిష్యత్తును ముందుగానే చాలా దూరం వరకు ఆలోచించడం నాకు ఇష్టం లేదు, గతంలో కూడా అలా చేయలేదు. ప్రస్తుతం నేను నా ఆటను, జట్టుతో గడిపే సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. నా తోటి ఆటగాళ్లు కూడా నాతో గడిపే సమయాన్ని ఇష్టపడతారని ఆశిస్తున్నా – రోహిత్ శర్మ