
పుణె: మహారాష్ట్రలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మరాఠీని నేర్చుకోవాల్సిందేనని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. తాము మరాఠీ స్థానంలో హిందీ తేవడం లేదని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. పుణెలోని భండార్కర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఫడ్నవీస్ మాట్లాడారు. ‘‘మేం మరాఠాలపై హిందీని రుద్దాలని అనుకోవడం లేదు. మహారాష్ట్రలో మరాఠీ భాష తప్పనిసరి నేర్చుకోవాల్సిందే.
న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం విద్యార్థులు మూడు భాషలు నేర్చుకునేందుకు అవకాశం ఉంది. అందులో రెండు ఇండియన్ లాంగ్వేజెస్ అయి ఉండాలి. వీటిల్లో మరాఠీ తప్పనిసరి చేశాం. ఇక మిగతా భాషల్లో హిందీ, తమిళ్, మలయాళం, గుజరాతీ ఎంచుకోవడానికి అవకాశం ఉంది. అయితే వీటిల్లో కేవలం హిందీకి మాత్రమే టీచర్లు అందుబాటులో ఉన్నారు” అని తెలిపారు. ‘‘మనం మన దేశ భాష అయిన హిందీని వ్యతిరేకిస్తం. కానీ విదేశీ భాష అయిన ఇంగ్లిష్‌ను మెచ్చుకుంటం. ఎందుకు మనోళ్లు ఇలా ఆలోచిస్తారో అర్థం కాదు” అని అన్నారు.