- బోర్డులు తప్ప ఆటల్లేవ్
- ఊరవతల క్రీడా ప్రాంగణాలు
- కొన్ని గ్రామాల్లో చెరువులు, గుట్టల్లో ఏర్పాటు
- ఏర్పాటై నెలలు అయినా ఆటలు ఆడింది లేదు
- పిచ్చిమొక్కలు మొలిచి పడావు పడుతున్న ప్లేగ్రౌండ్లు
- రూ.- లక్షలు ఖర్చు చేసినా నిరుపయోగమే
కరీంనగర్, వెలుగు: గ్రామాల్లో రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల్లో ఆటలు ఆడే పరిస్థితులు లేవు. కొన్ని గ్రామాల్లో గుట్టలు, చెరువు శిఖం భూముల్లో ఏర్పాటు చేయడంతో ఊరికి దూరంగా ఉన్నాయి. ప్రాంగణాల్లో క్రీడలకు సంబంధించి ఎలాంటి పనులు చేయకపోవడంతో ఆటలు ఆడేందుకు యువత ఆ వైపు కన్నెత్తి చూడటంలేదు. ఆటలు ఆడకపోవడంతో పిచ్చి మొక్కలు మొలిచి ప్రాంగణాలు పడావు పడ్డట్లుగా ఉన్నాయి. దీంతో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు లక్ష్యం నెరవేరకపోగా.. నిధులు దుర్వినియోగం అయ్యాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ముందుచూపు లేకుండా ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
చెరువు శిఖాల్లో.. కాలువ గట్ల మీద...
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి అన్ని ఊర్లల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణానికి రూ.2.60 లక్షలు, 30 గుంటలకు రూ.2.10 లక్షలు, 20 గుంటలకు రూ.1.70 లక్షల నిధులు ఇచ్చారు. గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి. కానీ అధికార పార్టీ లీడర్లు కాసులకు కక్కుర్తి పడి నిధులను ఖర్చు చేయకుండా ఉండేందుకు ఊరికి దూరంగా స్థలాలను చూపారు. కొన్ని చెరువు శిఖాల్లో నిర్మిస్తే.. మరికొన్ని పొలాలు, కాలువ గట్ల మీద, రాళ్లు, రప్పలు ఉండే స్థలాలను ప్రాంగణాల ఏర్పాటుకు ఎంపిక చేశారు. ఈ స్థలాలు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా ఖాళీగా ఉంటున్నాయి. టార్గెట్లు పూర్తి చేయడానికే ఇలా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారా అనే అనుమానాలు వస్తున్నాయి.
ఆటలాడేది ఎలా ..?
సైదాపూర్ మండలంలోని ఆరేపల్లిలో వెన్నంపల్లి గై చెరువు శిఖం భూమిలో ఏర్పాటు చేయగా వర్షానికి నీళ్లు వచ్చాయి. సైదాపూర్ గ్రామానికి కిలోమీటర్ దూరంలో సమ్మక్క గుట్టపై ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం అంతా గుట్ట బండరాళ్లు తప్ప ఆటలు ఆడే పరిస్థితి లేదు. ఇదే మండలం జాగిరిపల్లిలో ఊరగుట్ట వద్ద గుట్టపైనే ఏర్పాటు చేశారు. ఇక్కడ గుట్టకు క్వారీ తవ్వకాల పనులు నిరంతరంగా సాగుతుంటాయి. బాంబుల మోతలు, దుమ్ము ధూళితో నిండుకునే ఈ గుట్టపై క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం విడ్డూరం. ఇల్లందకుంట మండలం మల్యాల, శ్రీరాములపల్లిలో డబుల్ బెడ్ రూమ్ లకు కేటాయించిన స్థలాలను మైదానాల కోసం అప్పగించారు. గంగాధర మండలం ఆచంపల్లి శివారులోని వరదకాలువ వద్ద అధికారులు క్రీడాప్రాంగణం బోర్డు ఏర్పాటుచేశారు. తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల్లోనూ పలు చోట్ల ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. ఎలాంటి మందు చూపు లేకుండా ఇష్టారాజ్యంగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. కేవలం పనులు చేసి బిల్లులు పొందాలనే ఆలోచనతో ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి.
ఖాళీ బోర్డులే ..
గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల్లో బోర్డులు తప్ప వేరే క్రీడా వస్తువులు కనిపించడం లేదు. ఇక జమ్మికుంట వంటి మండలాల్లో అయితే చాలా చోట్ల ఈ స్థలాల ఎంపికలో వివాదాలు తలెత్తడంతో బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రీడా ప్రాంగణాల్లో ఖోఖో ఆడుకోవడానికి పోల్స్, లాంగ్ జంప్ కోసం ఇసుక పోసిన గుంత, వ్యాయామాలు చేసుకోవడానికి సింగిల్, డబుల్ బార్లు ఏర్పాటు చేయాలి. కానీ ఏ క్రీడా ప్రాంగణంలో ఇలాంటి ఏర్పాటు లేదు. క్రీడా ప్రాంగణాలుగా ఎంపిక చేసిన స్థలాలు అనువుగా లేకపోవడమే ఇందుకు కారణం. అధికారులు ఇచ్చిన టార్గెట్లకు అనుగుణంగా, లీడర్లు పెట్టిన ఒత్తిడికి ఊరిలో ఎక్కడో ఉన్న జాగాలను చూపి బోర్డులు ఏర్పాటు చేశారు. ఇవి ఏర్పాటు చేసి సుమారుగా రెండు మూడు నెలలు కావొస్తుంది. ఏ ఒక్క ప్రాంగణంలో ఆటలు ఆడింది లేదు.
“ చొప్పదండి మండలం భూపాలపట్నంలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో కుంట శిఖం భూమిలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. దీనికి ఎంట్రన్స్ బోర్డు ఏర్పాటు చేసి నాలుగు ట్రిప్పుల మొరం పోసి వదిలేశారు. కనీసం మట్టిని కూడా చదును చేయలేదు. దీంతో గడ్డి, తుప్పలు పెరిగి అధ్వానంగా మారింది. ఇందులో ఆటలకు సంబంధించి ఏర్పాట్లు చేయలేదు. ’
‘సైదాపూర్ మండలం జాగిరిపల్లి పంచాయతీ ఆధ్వర్యంలో సమీప ఊరగుట్ట వద్ద గుట్టపైనే క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఈ గుట్టకు క్వారీ తవ్వకాల పనులు నిరంతరంగా సాగుతుంటాయి. బాంబుల మోతలు, దుమ్ముధూళితో నిండుకునే ఈ గుట్టపై క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆడుకునేందుకు ఏ మాత్రం వీలుకాదు. బోర్డు పెట్టి వదిలేశారు. ’