![మంచిర్యాల జిల్లాలో రసవత్తరంగా..అవిశ్వాస రాజకీయం](https://static.v6velugu.com/uploads/2024/01/no-confidence-in-bellampalli-municipal-chairperson-jakkula-swetha-and-vice-chairman-battula-sudarshan-of-mancherial-district_iOFVj2bSJ5.jpg)
- క్యాంపునకు వెళ్లిన బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు
- చైర్పర్సన్, వైస్ చైర్మన్‌పై తీవ్రస్థాయిలో అసంతృప్తి
- గత నెల 7న నోటీసు ఇచ్చిన 23 మంది కౌన్సిలర్లు
- ఈ నెల 12న మున్సిపల్ ప్రత్యేక సమావేశం
బెల్లంపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు ఈ నెల 12న కలెక్టర్ తేదీ ఖరారు చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా బుధవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు క్యాంపుకు బయళ్దేరి వెళ్లారు. మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న 20వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ గోశిక రమేశ్, వైస్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న రెండో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ షేక్ అఫ్సర్ ఆధ్వర్యంలో 12 నుంచి 13 మంది కౌన్సిలర్లు క్యాంపునకు తరలివెళ్లారు.
మున్సిపాలిటీలో వార్డులకు నిధుల కేటాయింపు విషయంలో చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ వివక్ష చూపారని, నాటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చెప్పినట్టే వింటూ మున్సిపల్ అభివృద్ధిని పట్టించుకోలేదని వీరిద్దరిపై కౌన్సిలర్లు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసాన్ని కోరుతూ డిసెంబర్7న కలెక్టర్బదావత్సంతోష్కు 23 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు అందజేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయం పలుపులు తిరుగుతూ ఆసక్తి రేపుతోంది.
కాంగ్రెస్‌లోకి చైర్పర్సన్
కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేసిన తర్వాత తన పదవికి ముప్పు పొంచి ఉన్నట్టు గమనించిన చైర్పర్సన్జక్కుల శ్వేత ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత విడతల వారీగా దాదాపు 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మొదటి నుంచి చైర్ పర్సన్‌పై అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 11 మంది కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్నేటికీ బీఆర్ఎస్లోనే
కొనసాగుతున్నారు.
రూ.లక్షల్లో నజరానాలు
తమ పదవులను కాపాడుకునేందుకు చైర్పర్సన్, వైస్ చైర్మన్లు ప్రయత్నిస్తుండగా.. వారిని గద్దెదించి ఆ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా చైర్మన్, వైస్ చైర్మన్పదవులు ఆశిస్తున్నవారు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన 23 మందికి రూ.లక్షల్లో నజరానా ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక్కో కౌన్సిలర్‌కు చైర్మన్ అభ్యర్థి రూ.75వేలు
వైస్ చైర్మన్అభ్యర్థి రూ.50వేల చొప్పున ముట్టజెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు ఈ నెల 12 వరకు క్యాంపు ఖర్చులను భరించనున్నారు. అలాగే తమ పదవులను కాపాడుకునేందుకు ప్రస్తుత చైర్పర్సన్, వైస్ చైర్మన్లు కూడా కౌన్సిలర్లకు నజరానాలు ఆశచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎవరి ప్రయత్నాలు వారివే..
అవిశ్వాస క్యాంపుకు వెళ్లిన 12 మందితో పాటు మరికొందరు ఒకటి, రెండు రోజుల్లో క్యాంపునకు చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్పదవి ఎస్సీ జనరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన 11 మందిలో 6వ వార్డు కౌన్సిలర్ మాటూరు మధు కూడా ఆ పదవిని ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కు చెందిన 13 వ వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ ఆశిస్తున్నారు. సైలెన్స్‌గా ఉన్న మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు
కాంగ్రెస్ లో చేరిన 12 మంది కౌన్సిలర్లు ఎవరికి మద్దతునిస్తారో ఈనెల12న జరిగే మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో తేలే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీలో 34 వార్డులకు గానూ మ్యాజిక్ ఫిగర్18 ఉండాలి. కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎలా స్పందిస్తారో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.