
- బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం
- వచ్చేనెల 6న బలనిరూపణ
మెదక్, తూప్రాన్, వెలుగు : తూప్రాన్ మున్సిపల్లో బీఆర్ఎస్ చైర్మన్ వర్సెస్ వైస్ చైర్మన్‌గా రాజకీయ వివాదం మారింది. ఎప్పటి నుంచో అవకాశం కోసం చూస్తున్న వైస్ చైర్మన్, తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్‌లో చేరి.. చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టారు. దీంతో చైర్మన్ బొంది రవీందర్ గౌడ్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసంతృప్తితో ఉన్న వైస్ చైర్మన్, 7గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేరారు. మరో ఇద్దరు కాంగ్రెస్, ఒక బీఆర్ఎస్, ఒక బీజేపీ కౌన్సిలర్ సపోర్టుతో అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్‌కు నోటీస్ ఇచ్చారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
బీఆర్ఎస్లో మొదటి నుంచీ గొడవలే..
బీఆర్ఎస్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, వైస్ చైర్మెన్ నంద్యాల శ్రీనివాస్ మధ్య మొదటి నుంచీ విభేదాలు న్నాయి. చైర్మన్ ను దించేయాలని వైస్ చైర్మన్ వర్గం చాలాకాలంగా అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వైస్ చైర్మన్ సహా తొమ్మిది మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం చైర్మన్ రవీందర్ గౌడ్ మీద అవిశ్వాసం పెట్టారు. మొత్తం 10 మంది కౌన్సిలర్లు నేపాల్‌లో క్యాంప్ కు వెళ్లారు. ఈ నేపథ్యంలో చైర్మన్ రవీందర్ గౌడ్ సైతం తన మద్దతుదారులైన మరో ఐదుగురు కౌన్సిలర్లతో కలిసి క్యాంప్ కు వెళ్లారు.
రెండు క్యాంపులు.. రాజకీయ చర్చ..
రెండు వర్గాల క్యాంప్‌లు కొనసాగుతున్న క్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్ తోపాటు ఏడుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి కాంగ్రెస్‌లో చేరారు. చైర్మన్ పై అవిశ్వాసం ప్రవేశ పెట్టి నెగ్గాలంటే 11 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉండగా, వైస్ చైర్మన్ శ్రీనివాస్ వర్గం చైర్మన్ రవీందర్ గౌడ్ వర్గంలోని ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను తమ వైపు తిప్పుకుంది.
దీంతో 11 మంది కలిసి కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ రవీందర్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నందునే అతనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్టు వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ సహా , కౌన్సిలర్లు తెలిపారు. అభివృద్ధి పనుల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నట్టు కలెక్టర్‌కు ఇచ్చిన అవిశ్వాసం నోటీస్‌లో ఆరోపించారు.
ప్రయత్నాలు విఫలం చేస్తారనే...
కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన తరువాత వైస్ చైర్మన్ శ్రీనివాస్ వర్గం కౌన్సిలర్లు నేపాల్ వెళ్లారు. ఇక్కడే ఉంటే అవిశ్వాస ప్రయత్నాలు విఫలం చేసేందుకు చైర్మన్ రవీందర్ గౌడ్ ప్రయత్నిస్తాడని భావించి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వారిని నేపాల్ తీసుకెళ్లినట్టు తెలిసింది. అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్ మార్చి 6వ న తూప్రాన్ మున్సిపల్ ఆఫీస్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజు చైర్మన్ భవితవ్యం తేలిపోనుంది.