- స్పెషల్ ఆఫీసర్ పాలన ముప్పుతో వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు
- చైర్‌పర్సన్ బాధ్యతల కోసం వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం
- వైస్‌చైర్మన్ ఎన్నికకు చైర్పర్సన్ఉండాలంటున్న అధికారులు
- పునరాలోచన పడ్డ బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు
జగిత్యాల, వెలుగు : జగిత్యాల బల్దియాలో వైస్‌చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అవిశ్వాస సమావేశం కోసం కలెక్టర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అవిశ్వాసం నెగ్గినా చైర్‌పర్సన్ లేకుండా వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టలేమంటూ ఆఫీసర్లు తేల్చి చెప్పడంతో కౌన్సిలర్లు వెనక్కి తగ్గినట్లు ప్రచారం నడుస్తోంది.
ఇప్పటికే చైర్‌పర్సన్ లేనందున అవిశ్వాసం నెగ్గి వైస్‌చైర్మన్ పదవి పోతే ఇన్‌చార్జి ఆఫీసర్ల పాలన వస్తుందన్న భయం కౌన్సిలర్లలో ఉంది. అందుకే అవిశ్వాసంపై వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. దీంతో వైస్‌చైర్మన్‌గా ఎన్నికై ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌గా చలామణీ అవుదామనుకున్న ఆశావహులకు నిరాశ ఎదురైనట్లయింది.
ఆశావహుల ఆశలపై నీళ్లు
జగిత్యాల బల్దియా చైర్‌పర్సన్ రాజీనామాతో ఓసీ సామాజిక వర్గానికి చెందిన వైస్‌చైర్మన్‌కు బాధ్యత అప్పగించారు. బల్దియా చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో అప్పటి నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారు. కాగా చైర్‌పర్సన్ రాజీనామా చేసినందున ఆ వార్డులో ఎన్నిక పూర్తయ్యాకే చైర్‌పర్సన్ ఎన్నిక ఉంటుందని ఎన్నికల కమిషన్అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఇన్‌చార్జి చైర్‌పర్సన్ పదవి కావాలంటే తొలుత వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవాలని కౌన్సిలర్లు ప్లాన్చేశారు.
ఇందుకోసం రాజీనామా చేయాలని వైస్‌చైర్మన్‌పై ఒత్తిడి చేసినట్లు సమాచారం. దీంతో తనకు అదనంగా ఉన్న ఇన్‌చార్జి బాధ్యతలు తొలగించాలని వైస్ చైర్మన్ ఆఫీసర్లను కోరారు. ఈ ప్రయత్నం కూడా ఫెయిల్ అవడంతో ఆశావహుల ప్రోద్బలంతో 29 మంది కౌన్సిలర్లు జనవరి 16న జిల్లా ఆఫీసర్లకు అవిశ్వాస పత్రం అందజేశారు. ఈక్రమంలో ఫిబ్రవరి 14న సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్.. కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు.
దీంతో ఈ అవిశ్వాసం నెగ్గి వైస్ చైర్ పర్సన్ పదవితో పాటు ఇన్‌చార్జి చైర్ పర్సన్ పదవి దక్కించుకోవాలని ఆశావాహులు క్యాంప్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఇదిలాఉండగా, 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం వైస్ చైర్మన్ ను ఎన్నుకోవాలంటే చైర్‌పర్సన్ తప్పనిసరిగా ఓటేయాలని ఆఫీసర్లు తేల్చి చెప్పడంతో ఆశావహులు తలలుపట్టుకుంటున్నారు.
అవిశ్వాసం నెగ్గితే స్పెషల్ ఆఫీసర్ పాలనే..
ఆవిశ్వాసం నెగ్గితే ఆఫీసర్ల పాలన వస్తుందని భావిస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ వర్గపోరుతో సతమతమవుతున్నారు. ఈక్రమంలో కౌన్సిలర్లతో కలిసి చైర్ పర్సన్ పదవి దక్కించుకునేందుకు కొందరు ఆశావహులు వేసిన ప్లాన్లు బెడిసికొట్టాయి. అవిశ్వాసం నెగ్గితే స్పెషల్ ఆఫీసర్ పాలన వస్తుందని, అప్పుడు తమకు రాజకీయంగా, పదవులపరంగా ఎలాంటి అధికారం ఉండదని భావిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రస్తుత స్థితినే కొనసాగించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.