జనగామ బల్దియా మున్సిపల్​ చైర్మన్,​ వైస్ చైర్మన్‌‌లపై అవిశ్వాసం

  • అడిషనల్​ కలెక్టర్‌‌‌‌కు లెటర్​ ఇచ్చిన రూలింగ్, ప్రతిపక్ష కౌన్సిలర్లు 
  • అవిశ్వాసానికి 11 మంది బీఆర్ఎస్, 8 కౌన్సిలర్లు మద్దతు

జనగామ, వెలుగు: జనగామ మున్సిపల్​ రాజకీయం వేడెక్కింది. వారం రోజులుగా క్యాంపు రాజకీయాలు చివరిదశకు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ ​చైర్మన్, వైస్‌‌ చైర్మన్లపై అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్​ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం లెటర్​ ఇచ్చారు. 11 మంది బీఆర్ఎస్​ కౌన్సిలర్లు, 8 మంది కాంగ్రెస్​ కౌన్సిలర్లు కలిసి అడిషనల్​కలెక్టర్ ప్రపుల్​దేశాయ్‌‌కు లెటర్​ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి ఐక్యత పంతం నెగ్గేవరకు ఉంటుందా.. వీగిపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

రూలింగ్, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఐక్యంగా.. 

జనగామ బల్దియా చైర్‌‌‌‌పర్సన్​ పోకల జమున, వైస్​ చైర్మన్​ మేకల రాంప్రసాద్‌‌లపై అవిశ్వాసం, ఫ్లోర్‌‌‌‌లీడర్ మారబోయిన పాండులపై నిరసన తెలిపేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ 19 మంది అడిషనల్​కలెక్టర్‌‌‌‌కు లెటర్​ ఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ చైర్మన్​, వైస్​చైర్మన్‌‌ల వ్యవహారం పట్టణాభివృద్ధికి ఆటంకంగా తయారైందని, అందుకే అవిశ్వాసం పెట్టినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ​కౌన్సిలర్లు బండ పద్మయాదగిరిరెడ్డి(చైర్‌‌‌‌పర్సన్​పదవిని ఆశిస్తున్నారు)తోపాటు పేర్ని స్వరూప, అరవింద్‌‌రెడ్డి, శ్రీనివాస్, పాక రమ, నాగరాజు, దయాకర్​, అనిత, నీల శ్రీజ, చంద్రకళ, లక్ష్మి ఉన్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ కౌన్సిలర్లు జక్కుల అనిత, సుమలత, రాంచందర్​, మల్లేశం, కల్యాణి, అరుణ, చందర్​, బాల్దె కమలమ్మ మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. ప్రస్తుత చైర్మన్​, వైస్​ చైర్మన్​, ఫ్లోర్​ లీడర్లను మినహాయిస్తే బీఆర్ఎస్ కు చెందిన సురేశ్‌‌రెడ్డి, పి.సుధ, భూలక్ష్మి, ఎండీ సమద్, బీజేపీ కౌన్సిలర్లు నలుగురు ప్రస్తుతానికి దూరంగా ఉన్నారు. అయితే ‘అవిశ్వాస’ సమావేశానికి ముందు కలెక్టర్​ కౌన్సిలర్లను పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం సమావేశం నిర్వహణపై కలెక్టర్​ నిర్ణయం 
తీసుకోనున్నారు. 

కోరం ఉంటేనే ముందుకు...

బల్దియాలో 30 మంది కౌన్సిలర్లు, ఒకరు ఎక్స్​ అఫిషియో సభ్యుడు ఉన్నారు. వీరిలో రూలింగ్​పార్టీకి 18, కాంగ్రెస్​కు 8, బీజేపీ నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు. బీఆర్ఎస్​నుంచి 11 మంది అవిశ్వాసానికి సై అంటున్నారు. వీరికి అపోజిషన్​ నుంచి 8 మంది జతయ్యారు. మొత్తంగా 19 మంది ప్రస్తుతానికి అవిశ్వాసానికి మద్దతిస్తున్నారు. ఎన్నిక రోజు కోరం సభ్యులు(21 మంది) హాజరైతే అవిశ్వాసం ముందుకు పోతుంది. లేకపోతే మళ్లీ ఏడాది వరకు అవిశ్వాస తీర్మాన ప్రత్యేక సమావేశం పెట్టడానికి అవకాశం లేదని మున్సిపల్​కమిషనర్​ రజిత  తెలిపారు. కాగా జనవరి 25న మొదలైన క్యాంపు రాజకీయానికి ఎట్టకేలకు తెరపడింది. భువనగిరి, మేడారం, భద్రాచలం, హన్మకొండ హరిత హోటల్‌‌లో సాగిన క్యాంపు రాజకీయాలు శుక్రవారంతో ఎండ్​ పడింది. ప్రస్తుతం కౌన్సిలర్లంతా జనగామలోనే ఉన్నారు.