చొప్పదండిలో 12 మంది జడ్పీటీసీల రహస్య భేటీ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్  జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయపై జిల్లాలోని జడ్పీటీసీలు తిరుగుబాటు జెండా ఎగరేశారు.  ఎన్నో రోజులుగా జడ్పీ చైర్ పర్సన్ తీరుపై ఆగ్రహంతో ఉన్న 12 మంది జడ్పీటీసీలు బుధవారం చొప్పదండి మండలం ఆర్నకొండలో  రహస్యంగా సమావేశమయ్యారు. జడ్పీ చైర్ పర్సన్ పదవీకాలం ఈనెల 6(గురువారం)తో నాలుగేండ్లు పూర్తి కావడం, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి చట్టపరంగా చాన్స్​ ఉండడంతో.. త్వరలో తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయానికొచ్చారు. 

నిధుల్లేవని నిరసన.. 

ప్రజాప్రతినిధులుగా ఎన్నికై నాలుగేండ్లైనా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడం, తాము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేకపోవడంతో జడ్పీటీసీలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  టీఆర్ఎస్ పార్టీలో ఉన్న టైంలో ఆయన అనుచరురాలిగా ఉన్న ఇల్లందకుంట జడ్పీటీసీ కనుమల్ల విజయను జడ్పీ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యేలా చేశారని,  బీజేపీ మూలాలున్న ఆమె బీఆర్ఎస్ కోసం పని చేయడం లేదని జడ్పీటీసీలు ఆరోపిస్తున్నారు. అంతేగాక వచ్చిన నిధులను కూడా జడ్పీటీసీలకు జడ్పీ చైర్ పర్సన్ విజయ పూర్తి స్థాయిలో కేటాయించలేదనే అసంతృప్తిలో ఉన్నారు.  నిధుల విషయంలో  రాష్ట్ర ప్రభుత్వంపై  కూడా తమకు అన్యాయం చేశారని,  ప్రాధాన్యమివ్వడం లేదని జడ్పీటీసీలు  ఈ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే రెండు, మూడు రోజుల్లో‌ కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సమావేశానికి జడ్పీ వైస్ చైర్మన్ గోపాల్ రావు, జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్​, హుజూరాబాద్ జడ్పీటీసీ బక్కారెడ్డి హాజరు కాలేదు.
 

జడ్పీ చైర్ పర్సన్  బరిలో చొప్పదండి జడ్పీటీసీ

అవిశ్వాసం సక్సెస్ అయితే చైర్ పర్సన్ గా చొప్పదండి జడ్పీటీసీ సౌజన్యను ఎన్నుకోవాలని జడ్పీటీసీలు  నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందుకే చొప్పదండి కేంద్రంగా క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇదిలా ఉండగా జిల్లా మంత్రి గంగుల, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ ఫారిన్​ టూర్​లో ఉండగా ఈ భేటీ కావడం చర్చనీయాంశమైంది.వారు వచ్చాకే ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.