వైరా మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం

బీఆర్ఎస్​ పార్టీకి చెందిన వైరా మున్సిపల్ చైర్మన్​ సూతకాని జైపాల్ పై కలెక్టర్​ వీపీ గౌతమ్​కు ఆ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం అందజేశారు. సోమవారం సాయంత్రం జిల్లా ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్​కాంప్లెక్స్​ లో కలెక్టర్​వీపీ గౌతమ్​ను 16 మంది కౌన్సిలర్లు కలిశారు. వీరిలో 14 మంది బీఆర్ఎస్​ కౌన్సిలర్లు, ఇద్దరు కాంగ్రెస్​ కౌన్సిలర్లు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ ​సూతకాని జైపాల్ ప్రస్తుతం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వర్గంలో ఉన్నారు. మున్సిపాలిటీలో 20 మంది కౌన్సిలర్లుండగా, జైపాల్ వెంట నలుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు.

వైరాలో పొంగులేటి వర్గానికి చెక్​ పెట్టేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​ఆధ్వర్యంలో ఈ అవిశ్వాసానికి స్కెచ్​వేశారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి వైరా ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​లో రాములునాయక్​ తో కలిసి కౌన్సిలర్లతో భేటీ అయ్యారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్​ బహిరంగ సభలో వైరా మున్సిపాలిటీకి రూ.30 కోట్లను సీఎం కేసీఆర్ ప్రకటించారని, వాటితో మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని కౌన్సిలర్లతో చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుందామన్నారు.

ఈ మీటింగ్ లోనే కొత్త చైర్మన్​ అభ్యర్థిపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. చైర్మన్​ పదవిని ఆశిస్తున్న నాయకుడితో కూడా మాట్లాడించినట్టు సమాచారం. ఆ తర్వాత ఇద్దరు కాంగ్రెస్​కౌన్సిలర్లు, 14 మంది బీఆర్ఎస్​ కౌన్సిలర్లను వెంట బెట్టుకొని కలెక్టరేట్ కు తీసుకెళ్లారు. అక్కడ కలెక్టర్ కు అవిశ్వాస తీర్మాన కాపీని అందజేశారు.