విపక్షాలతో కలిసి బీఆర్ఎస్ ​కౌన్సిలర్ల భువనగిరి చైర్మన్​పై అవిశ్వాసం

యాదాద్రి, వెలుగు: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డికి సొంత పార్టీ​ కౌన్సిలర్లు జలక్ ​ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్​ కౌన్సిలర్లతో కలిసి ఇద్దరు బీఆర్ఎస్​కౌన్సిలర్లు భువనగిరి మున్సిపల్​చైర్మన్​ ఎనబోయిన ఆంజనేయులు, వైస్​ చైర్మన్​ చింతల కిష్టయ్యపై అవిశ్వాసం ప్రకటించారు. యాదాద్రి కలెక్టర్​ పమేలా సత్పతికి అవిశ్వాసం నోటీసు అందించారు. భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు ఉండగా బీఆర్​ఎస్ 15 సీట్లు, కాంగ్రెస్​11, బీజేపీ 7, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. గతంలో చైర్మన్​ పదవిని ఆశించిన పలువురు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు చెందిన జిట్టా వేణుగోపాల్​రెడ్డి బీఆర్ఎస్​లో చేరడంతో ఆ పార్టీకి బలం 18కి చేరింది. ఇప్పుడు రాష్ర్టంలో ఎక్కడ చూసినా మూడేండ్ల తర్వాత మున్సిపాలిటీల్లో అవిశ్వాసం ప్రకటిస్తున్నారు. దీంతో భువనగిరి కౌన్సిలర్లు కూడా అదే దారిలో ఉన్నారు. 

గమనించిన ఎమ్మెల్యే వారిని సముదాయిస్తున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్​ అవిశ్వాసం ప్రకటించేందుకు సన్నద్ధం కావడంతో బీఆర్ఎస్​కు చెందిన​ అజీమ్, కుశంగుల ఎల్లమ్మ వారితో జత కట్టారు. ఎమ్మెల్యే ఏరికోరి చేసిన చైర్మన్​, వైస్​చైర్మన్​కు వ్యతిరేఖంగా సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి ముందుకు రావడం, మరికొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా చైర్మన్ పై వ్యతిరేకతతో ఉన్నట్టు తెలుస్తోంది.