సూర్యాపేటలో పేట కౌన్సిలర్ల తిరుగుబాటు .. కలెక్టర్‌‌‌‌ వెంకట్‌‌రావుకు నోటీస్ అందజేత

  • చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌‌లపై అవిశ్వాసం పెట్టేందుకు రెడీ
  • ఆ వెంటనే క్యాంప్‌కు తరలివెళ్లిన కౌన్సిలర్లు

సూర్యాపేట, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల ట్రెండ్ నడుస్తోంది.  మూడు రోజుల కిందనే నల్గొండ మున్సిపాలిటీని బీఆర్‌‌‌‌ఎస్‌‌ నుంచి కాంగ్రెస్‌‌ కైవసం చేసుకోగా.. భువనగిరి మున్సిపల్ చైర్మన్‌‌పై అవిశ్వాసానికి కలెక్టర్ ఈ నెల 23న తేదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  తాజాగా సూర్యాపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు కూడా తిరుగుబాటు జెండా ఎగరేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్‌‌‌‌పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం 32 మంది కౌన్సిలర్లు తీర్మానంపై సంతకాలు చేసి కలెక్టర్‌‌‌‌ వెంకట్‌‌రావుకు నోటీసు అందజేశారు. ఆ వెంటనే క్యాంప్‌కు తరలివెళ్లారు. 

మొత్తం 48 వార్డులు

సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా 24 స్థానాల్లో బీఆర్ఎస్, 15 స్థానాల్లో కాంగ్రెస్, 5 చోట్ల బీజేపీ, నలుగురు ఇండిపెండెంట్లు గెలిచారు.  బీజేపీ నుంచి ఒకరు, కాంగ్రెస్‌‌ నుంచి ఇద్దరు, ముగ్గురు ఇండిపెండెంట్లు  బీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరడంతో ఆ పార్టీ బలం 30కి చేరింది. అయితే చైర్మన్‌‌ జనరల్ స్థానం అయినప్పటికీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్‌‌ రెడ్డి  ఎస్సీ మహిళ అన్నపూర్ణను చైర్ పర్సన్‌‌ చేశారు. 

వార్డులకు ఫండ్స్ కేటాయింపుల్లో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ వివక్ష చూపించడం,  ఎమ్మెల్యే అనుచరుడికి కాంట్రాక్ట్ వర్క్స్ ఇప్పించడాన్ని బీఆర్‌‌‌‌ఎస్‌‌ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో కొందరు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేసినా.. జగదీశ్‌‌ రెడ్డి బుజ్జగించడంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.  

32 మంది సంతకాలు

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చైర్ పర్సన్‌‌ను గద్దె దింపేందుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌ కౌన్సిలర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు కాంగ్రెస్‌‌, బీజేపీ కౌన్సిలర్లతో చర్చలు కూడా జరిపారు.  ఇందులో భాగంగానే  బుధవారం 16 మంది బీఆర్‌‌‌‌ఎస్‌‌,  8 మంది కాంగ్రెస్, నలుగురు బీజేపీ,  బీఆర్‌‌‌‌ఎస్ నుంచి బీఎస్పీలో చేరిన నలుగురు కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానంపై సంతకాలు చేశారు. అనంతరం   2, 3 వార్డులకు చెందిన బీఆర్‌‌‌‌ఎస్‌‌ కౌన్సిలర్లు, 44 వార్డుకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ కలిసి కలెక్టర్‌‌‌‌కు నోటీస్ అందించారు.  

క్యాంప్‌‌కు తరలివెళ్లిన కౌన్సిలర్లు 

కలెక్టర్‌‌కు నోటీసు ఇచ్చిన తర్వాత  32 మంది కౌన్సిలర్లు కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో క్యాంప్‌నకు తరలివెళ్లారు. వారంతా హైదరా బాద్‌‌కు వెళ్లినట్లు తెలిసింది. కలెక్టర్ అవిశ్వాసం తేదీ ప్రకటించిన వెంటనే నేరుగా మున్సిపాలిటీకి రానున్నట్లు సమా చారం. కాగా, చైర్మన్‌‌ రేసులో  31 వార్డుకు చెందిన బీఆర్‌‌‌‌ఎస్ కౌన్సిలర్ కొండపల్లి నిఖిల రెడ్డి,  వైస్ చైర్మన్ పదవి రేసులో కాంగ్రెస్  నుంచి కక్కిరేణి శ్రీనివాస్, వెలుగు వెంకన్న, షఫి ఉల్లా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.