- ఎన్నిలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్లు
- 26కు చేరిన కాంగ్రెస్ బలం
- త్వరలో మున్సిపల్ కౌన్సిల్ భేటీ
నల్గొండ, వెలుగు: నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై అవిశ్వాస తీర్మానం పె ట్టేందు కు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 9 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలం 27కు చేరింది. నల్గొండలో 48 వార్డులు ఉండగా 20 మంది కాంగ్రెస్ నుంచి, 17 మంది బీఆర్ఎస్ నుంచి, ఐదుగురు బీజేపీ నుంచి గెలిచారు. కాంగ్రెస్ కౌన్సిలర్లలో ఒకరు చనిపోతే ఉప ఎన్నిక రాగా.. బీఆర్‌ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి మరో కౌన్సిలర్ బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో పాలకవర్గం ఎన్నికలప్పుడు ఎమ్మెల్సీల సపోర్ట్ తీసుకొని సైదిరెడ్డి చైర్మన్ అయ్యారు.
సీన్ రివర్స్
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, చైర్మన్ సైదిరెడ్డిపై తిరుగుబాటు చేసిన వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్‌తో సహా పలువురు కౌన్సిలర్లు ఎలక్షన్లకు ముందు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షం లో కాంగ్రెస్‌లో చేరారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం పాలకవర్గం పదవీ కాలం మూడేండ్లు దాటితే అవిశ్వాసం పెట్టొచ్చు. వచ్చే ఏడాది జనవరి నాటికి పాలకవర్గం పవర్లోకి వచ్చి నాలుగేండ్లు పూర్తవుతుంది. కాబట్టి త్వరలో అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ కౌన్సిలర్లు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా త్వరలో మున్సిపల్ కౌన్సిల్ భేటీ కానున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీలోని అక్రమాలను ఆధారాలతో సహా బయటకు తీస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని కాంగ్రెస్ కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు.
మరో మూడు మున్సిపాలిటీల్లోనూ..
ఉమ్మడి జిల్లాలో కోదాడ, నకిరేకల్, చండూరు మున్సిపాలిటీల్లో కూడా అవిశ్వాసం పెట్టాలని అక్కడి కౌన్సిలర్లు కమిషనర్లకు తీర్మాన పత్రాలు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో సర్కారు అవిశ్వాస తీర్మానాలకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో కౌన్సిలర్లు చైర్మన్లు, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.