సూర్యాపేట: సూర్యపేట మున్సిపల్పాలకవర్గంపై అవిశ్వాసం పెట్టాడానికి అసమ్మతి వర్గం నేతలు ప్రయత్నిస్తునారు. చైర్మన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారు. దీనికోసం కుర్చీ ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమకు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్ల సంతకాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా కౌన్సిలర్లు క్యాంపునకు తరలివెళ్లారు. కాసేపటి క్రితమే కలెక్టర్ కు ఆవిశ్వాస లెటర్ ను అందజేశారు.
సూర్యాపేట మున్సిపాలిటీ లో మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాగా ప్రస్తుతం బీఆర్ఎస్ కు 30 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ కు 8 మంది, బీజేపీకి 4, బీఎస్పీకి నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు. చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలంటే 32 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉంటుంది. ఇందుకుగాను 35 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పై కలెక్టర్ ను కలిసి లెటర్ ఇవ్వనున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో జనరల్ స్థానంలో ఎస్సీ మహిళను చైర్ పర్సన్ గా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నియమించారు. దీనితో చైర్మన్ పదవి ఆశించి భంగపడ్డ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ పై గుర్రుగా ఉన్నారు.