అధికార, విపక్షాల విశ్వాస, అవిశ్వాస పరీక్షలు

​అవిశ్వాస తీర్మానం అనేది పార్లమెంటులో ప్రభుత్వ బలాన్ని పరీక్షించడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ అస్త్రం. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం ఓడిపోతే, రాజీనామా చేయాలి.  ప్రతి భారత ప్రధాని అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నవారే. అవిశ్వాస తీర్మానం అనేది భారత రాజ్యాంగం ఆమోదించిన బ్రిటీష్ తరహా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోనిది. బ్రిటీష్ పార్లమెంటు వలె, భారత పార్లమెంటుకు స్థిర-కాల వ్యవధి లేదు. లోక్‌‌సభలో ఎవరికి మెజారిటీ వచ్చినా ప్రభుత్వం ఏర్పడుతుంది. అందువల్ల పార్లమెంటులో ప్రభుత్వం మెజారిటీని కోల్పోయినప్పుడు, రాజీనామా చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో 1947 నుంచి 27 అవిశ్వాస తీర్మానాలు జరిగాయి. కానీ 1979లో తన ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడంతో ప్రధాని మొరార్జీ దేశాయ్ మాత్రమే రాజీనామా చేశారు. మరో ముగ్గురు ప్రధానులు 1990లో వీపీ సింగ్, 1997లో దేవెగౌడ, 1999లో వాజ్​పేయి విశ్వాస పరీక్షకు వెళ్లి ఓడిపోయారు.

తొలి అవిశ్వాస తీర్మానం

జవహర్‌‌లాల్ నెహ్రూ1947 నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. దాదాపు దశాబ్దంన్నరపాటు పాలన సాగించిన నెహ్రూపై అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికి ఎవరూ సాహసించలేదు. కానీ1962లో చైనా చేతిలో భారత్ ఓటమి తర్వాత, ప్రతిపక్ష నేత జె.బి. కృపలానీ 1963 ఆగస్టులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారతదేశ అవమానకరమైన ఓటమికి నెహ్రూ కారణమని ఆయన ఆరోపించారు. కానీ అవిశ్వాసం వీగిపోయింది. ఆ తర్వాతే నెహ్రూ నెమ్మదిగా దేశంలో తన ప్రతిష్టను కోల్పోయారు. ఏదైనా ప్రభుత్వాన్ని సవాల్ చేయడానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఒక మంచి మార్గం. దీనిపై సుదీర్ఘ చర్చ జరిగి, ఆ తర్వాత ప్రధాని సమాధానం చెబుతారు. చాలా ముఖ్యమైన సమస్యను లేవనెత్తినట్లయితే, అప్పుడు దానిపై యావత్తు దేశం దృష్టి కేంద్రీకరిస్తుంది.1963 ఆగస్టులో నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత కృపలానీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు.. చట్టసభలో నెహ్రూ మొదటిసారిగా సవాల్​ఎదుర్కొన్న సందర్భంగా దేశమంతా ఎంతో ఆసక్తిగా చూసింది. ఆ అవిశ్వాస తీర్మానం నెహ్రూ రాజకీయ జీవితంలో ఒక మలుపు. 

ముఖ్య కారణాలు ఉండాలి..

అవిశ్వాస తీర్మానానికి ముఖ్య కారణాలు ఉండాలి. నెహ్రూ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నట్లే, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు విశ్వాస పరీక్ష తప్పలేదు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పార్లమెంటులో భారీ మెజారిటీని కలిగి ఉన్నందున ఆ సమయంలో వారు ఆందోళన చెందలేదు. కానీ పీవీ సమయంలో అప్పుడు  మైనారిటీ ప్రభుత్వం ఉండే. అందువల్ల ప్రతి అవిశ్వాస తీర్మానం నరసింహారావుకు తీవ్రమైన పరీక్షగానే కనిపించింది. 1993 జులైలో పీవీ మూడో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని తృటిలో గెలిచాడు. ఆయన ఓడిపోతారని చాలామంది ఊహించారు. యావత్తు దేశం ఆ ఘట్టాన్ని ఆసక్తిగా చూసింది. కానీ తెలుగు తేజం మాత్రం విజయం సాధించారు. 2003 నుంచి 2018 వరకు అవిశ్వాస తీర్మానాలు లేవు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(2004 నుంచి-2014) కాలంలో అనేక కుంభకోణాలు జరిగాయి. మంత్రులు రాజీనామా చేశారు కూడా. కానీ బీజేపీ ఎప్పుడూ అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. నరేంద్ర మోదీ 2018లో తన మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు రెండోసారి ఎదుర్కొంటున్నారు. 2018లో నరేంద్ర మోదీకి పూర్తి మెజారిటీ ఉంది. నిజానికి ఇప్పుడు కూడా ఉన్నది. నిజంగా పీవీ లాంటి ప్రమాదమేమీ ఇప్పుడు లేదు. అప్పట్లో 542 మంది ఎంపీలకు గాను నరసింహారావుకు 225 మంది మాత్రమే ఉన్నారు.

ప్రస్తుత తీర్మానం

దేశంలోని వివిధ సమస్యలపై ప్రభుత్వంపై దాడి చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. కానీ మణిపూర్‌‌ అల్లర్లపై చర్చించడానికే అవిశ్వాసతీర్మానం పెట్టామని ఇండియా కూటమి అంటోంది. అంతర్జాతీయ ప్రతిష్టను అది దెబ్బతీస్తుందేమోననే ధ్యాస ప్రతిపక్షాల్లో కనిపించడం లేదు. ధరల పెరుగుదల లేదా నిరుద్యోగం లేదా దేశంలోని ఇతర ఏ సమస్యలు ప్రపంచదృష్టిని ఆకర్షించేలా లేవు. మణిపూర్‌‌లో శతాబ్దాల తరబడి శత్రువులుగా ఉన్న తెగల మధ్య అల్లర్లు చెలరేగాయి. అది మన అంతర్గత సమస్య. అవిశ్వాస తీర్మానం అందుకోసమే పెట్టామని చెప్పడం సరికాదు కదా!  ఈ ఎత్తుగడ ప్రతిపక్షాలకు ఏమేరకు ఉపయోగపడుతుందో తెలియదు. బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. అయితే మణిపూర్ సమస్య ఒక భాగంగా కావాలి తప్ప అది మాత్రమే సమస్యగా చిత్రించడం కరెక్ట్​కాదు.  కేవలం తెగల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు భారత ప్రభుత్వంపై ఏదో యుద్ధం జరిగినట్లుగా పరిస్థితిని సృష్టించడం సమర్థనీయం కాదేమో! అవిశ్వాస తీర్మానం కోసం ఎంచుకున్న ఈ అంశం దేశ ప్రతిష్ట పరిధిని దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే!

ఎందుకు విఫలమవుతాయి?

ఇజ్రాయెల్, జపాన్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో అవిశ్వాస తీర్మానాలు విజయవంతమవుతాయి. ఎందుకంటే ఏ ఎంపీ అయినా.. పార్టీతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఎటువైపు అయినా ఓటు వేయవచ్చు. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో ఉన్న మన లాంటి దేశంలో అవిశ్వాస తీర్మానాలు పెద్దగా సక్సెస్​ కాలేవు. ఎందుకంటే ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నప్పటికీ.. విప్​ ఉంటే ఎంపీలు సొంత పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయలేరు. ఒక వేళ వేస్తే వారి స్థానాన్ని కోల్పోతారు. ఇంగ్లండ్‌‌లో గత నాలుగేండ్లలో నలుగురు ప్రధానమంత్రులు మారారు.  ఎందుకంటే ఎంపీలు ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడ ఫిరాయింపుల నిరోధక చట్టం లేదు. మన దగ్గర 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చింది. 

ఎంపిక చేసుకున్న అంశం..

1963లో తనపై వచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రస్తావిస్తూ.. “అవిశ్వాస తీర్మానం ప్రభుత్వాన్ని గద్దె దించి.. ఆ స్థానంలోకి రావడమే లక్ష్యంగా ఉంటుంది. అలాంటి ఆశ లేనప్పుడు చర్చ అనవసరం”అని నెహ్రూ అన్నారు. అంశంపై చర్చ జరగొచ్చు.. కానీ ప్రస్తుతం ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం విఫలమవుతుంది. ప్రస్తుతం నెహ్రూ జీవించి ఉంటే, ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం కోసం ఎంపిక చేసుకున్న అంశం భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆయన విమర్శించి ఉండొచ్చు. ఎందుకంటే దానివల్ల జరిగే నష్టం దేశానికే కాబట్టి. 3 అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న ఏకైక ప్రధాని పీవీ నరసింహారావు. కానీ ఆయన చాణక్య వ్యూహంతో విశ్వాస పరీక్షలో ప్రతీసారి విజయవంతమయ్యారు. 

- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్