అశ్వాపురం, వెలుగు : అశ్వాపురం మండల పరిషత్ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రంపై ఎంపీటీసీ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. వైస్ ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్టు భద్రాచలం ఆర్డీవోకు ఇటీవల అశ్వాపురం మండల పరిషత్ కు చెందిన ఎనిమిది మంది ఎంపీటీసీలు నోటీసు అందజేశారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఆదేశానుసారం భద్రాచలం ఇన్చార్జీ ఆర్డీవో సుమ అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న రైతువేదికలో సోమవారం ఎంపీటీసీల సమావేశాన్ని నిర్వహించారు.
వైస్ ఎంపీపీపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టగా మొత్తం12 మంది ఎంపీటీసీల్లో ఎనిమిది మంది సమావేశానికి హాజరయ్యారు. వారందరూ చేతులు ఎత్తడంతో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సమావేశంలో అశ్వాపురం తహసీల్దార్ స్వర్ణ ఎండీవో గంట వరప్రసాద్, సూపరింటెండెంట్ పిచ్చేశ్వరరావు, యూడీసీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.