చౌటుప్పల్ వెలుగు: సొంత పార్టీ ఎంపీటీసీలు బీఆర్ఎస్ ఎంపీపీపై అవిశ్వాసం తీర్మానం ప్రవే శ పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో గురువారం జరిగింది. మండలంలో ఎంపీపీ గుత్తా ఉమా రెడ్డితో సహా 13 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో 9 మంది బీఆర్ఎస్ ఎంపీటీసీలు. మరో ఇద్దరు సీపీఐ, సీపీఎంతో కలుపుకొని 11 మంది ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చౌటుప్పల్ ఆర్డీవో వెంకట రెడ్డి కి తీర్మాన కాపీని అందజేశారు.
తాము ఎవరి ఒత్తిడితో అవిశ్వాసం పెట్టడం లేదని , ఎంపీటీసీలందరూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే అవిశ్వాసం పెడుతున్నామని వైస్ ఎంపీపీ ఆంగోతు రాజు తెలిపారు. అవిశ్వాసం తెలిపిన ఎంపీటీసీలలో దోటి జంగయ్య, బచ్చనగొని గాలయ్య, ఈసం యాదయ్య, దోనూరి శ్రావణి, శివరాత్రి కవిత, కరెంటోతు విజయ, నర్రి పావని, గడ్డం రాములమ్మ, బానోతు రజిత, దూడ వినోద్ రెడ్డి ఉన్నారు.