బల్దియా చైర్ పర్సన్ భోగ శ్రావణిపై అవిశ్వాస తీర్మానం?

జగిత్యాల బల్దియా ఛైర్ పర్సన్ భోగ శ్రావణి పై కౌన్సిల్ సభ్యులు అవిశ్వాస తీర్మానం కోసం శనివారం సాయంత్రం సంతకాల సేకరణ చేసినట్లు సమాచారం. బల్దియాలోని 48 వార్డులకు 48 మంది కౌన్సిలర్లు, 4 గురు కో ఆప్షన్ మెంబర్లు కలిపి 52 మంది కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. వీరిలో ఆరుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు ఉండగా, ఒకరు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఉన్నారు. మొత్తంగా పది మంది ప్రతిపక్ష కౌన్సిలర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 26 మంది కౌన్సిలర్ల వద్ద బల్దియా పాలకవర్గంలో కీలక నేతగా ఉన్న ఓ నేత ఆవిశ్వాసం పెట్టెందుకు అంగీకరిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

 కౌన్సిలర్లు దీనికి సంబంధించిన పత్రాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది.  ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ కు నడుమ వర్గ పోరు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఛైర్ పర్సన్ పార్టీ మారుతారనే ప్రచారమే ఆవిశ్వాసంకు కారణంగా బీఆర్ఎస్ నేతలు గుస గుసలాడుతున్నారు. ఏది ఏమైనా ఆవిశ్వాసం పెట్టాలంటే మూడేళ్లు గడిచి ఉండాలనే నిబంధన ఈ నెల 27 తో పూర్తికానుండడంతో ఈ విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.