మండలాల్లో అవిశ్వాసాలకు సర్కారు అడ్డుపుల్ల

  • రాజకీయ ప్రయోజనాల కోసం సభ్యుల హక్కులకు భంగం
  • ఈ నెల మొదటి వారంలో ముగిసిన నాలుగేళ్ల పదవీ కాలం
  • రాష్ట్రంలో 100కు పైగా మండలాల్లో ఎంపీపీల మీద అవిశ్వాస తీర్మానాలు
  • ఎన్నికల వేళ నోటీసులు ఇవ్వొద్దని ఆఫీసర్లకు ఓరల్​ ఆర్డర్స్​ 
  • సీటు కాపాడుకునేందుకు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్న ఎంపీపీలు 
  • పలు చోట్ల  రాజీనామాలకు రెడీ అంటున్న ఎంపీటీసీలు

మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం ఎంపీపీ పల్లె కల్యా ణి అధికార పార్టీ ఎంపీపీ. ఆమె పై అవిశ్వాసం కోరుతూ 9 మంది ఎంపీటీ సీలు అడిషనల్​ కలెక్టర్​, ఆర్డీఓకు అవిశ్వాసం తీర్మానం అందజేశారు. మం డలంలో 11 మంది ఎంపీటీసీలు ఉండగా అందులో వైస్​ ఎంపీపీ మరణిం చారు. దీంతో ప్రస్తుతం 10 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఎంపీపీని మిన హాయిస్తే 6 మంది బీఆర్​ఎస్​కాగా, ముగ్గురు బీజేపీ ఎంపీటీసీలు కలిసి అ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఎన్నికల టైంలో రూ.20లక్షల చొప్పున ఫండ్స్​ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఎంపీపీ ఎన్నికకు సహరించినందుకుగాను డబ్బులు ఆశ చూపెట్టి ఇచ్చిన చెక్కులు చెల్లకుండా పోయాయని ఎం పీటీసీ సభ్యులు అంటున్నారు. అలాగే తమ గ్రామాలకు ఫండ్స్​ కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో మండల ప్రజాపరిషత్​ సభ్యుల హక్కులను సర్కారు​ కాలరాస్తోంది. పంచాయతీరాజ్​చట్ట ప్రకారం ఎంపీపీల మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను ఆమోదించకుండా కట్టడి చేస్తోంది. ఈ విషయంలో సొంత​ రాజకీయ ప్రయోజనాలకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోంది. ఎలక్షన్ల ముందు అవిశ్వాస తీర్మానాలను ఆమోదిస్తే రాజకీయంగా తనకు నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశ్యంతో తీర్మానాలను ఆమోదించవద్దని ఆఫీసర్లకు ఓరల్​ ఆర్డర్స్​ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంపీపీలు కొలువుదీరి నాలుగేళ్లు పూర్తికావడంతో  రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వందకు పైగా మండలాల్లో అవిశ్వా స తీర్మానాలు ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్​ చట్ట ప్రకారం ఎంపీపీల పనితీరు నచ్చకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు సభ్యులకు ఉంది. నాలుగేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఫండ్స్​ కేటాయింపులో వివక్ష చూపడం, పదవులు, ఫండ్స్​ కోసం ఒప్పందాలు చేసుకొని మాట తప్పడం వంటి పలుకారణాలతో సభ్యులు అవిశ్వాస తీర్మానం పెడ్తున్నారు. కానీ సర్కారు ఆదేశాలతో ఆఫీసర్లు ఆమోదించడం లేదు. ఇదే అదనుగా సీట్లను కాపాడుకునేందుకు ఎంపీపీలంతా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం ఆసక్తి రేపుతున్నది.

అవిశ్వాసాలకు హైకమాండ్​ నో.. 

మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉండడంతో ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్​హైకమాండ్​ అంగీకరించట్లేదు. ఎన్నికల ముందు సొంత పార్టీ ఎంపీపీల పైన తిరుగుబాటు చేయడం వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందని, అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని ఇప్పటికే ఎమ్మెల్యేలను ఆదేశించింది. కానీ ఫీల్డ్​ లెవల్​లో ఎంపీపీల పనితీరు నచ్చని మండలాల్లో ఎంపీటీసీలంతా అవిశ్వాస తీర్మానాలకు రెడీ అవుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేల మాటను కూడా లెక్కచేయకుండా ఇప్పటికే 100కు పైగా మండలాల్లో ఆఫీసర్లకు నోటీసులు ఇస్తున్నారు. దీంతో తీర్మానాలను అధికారులు ఆమోదించకుండా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కారు ఓరల్ ఆర్డర్స్​ఇచ్చింది. అదే సమయంలో తమ పదవులు కాపాడుకునేందుకు ఎంపీపీలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నారు. మరో ఏడాది మాత్రమే పదవీ కాలం ఉన్నందున ఎంపీపీలు దారికి రాకపోతే వాళ్ల ను పదవి నుంచి దించేందుకు తాము మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకైనా వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీపీలకు పడని చోట మరోతరహా రాజకీయం నడుస్తున్నది. నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభా కర్​రెడ్డి, నారాయాణ్​పూర్ ఎంపీపీ గుత్తా ఉమాదేవికి పడకపోవడంతో ఆ మె పైన అవిశ్వాస తీర్మానం పెట్టించడమే గాక ఆర్డీఓతో నోటీసులు కూడా ఇప్పించారు. దీంతో ఎంపీపీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మునుగో డు సెగ్మెంట్​లోనే నాలుగు మండలాల్లో ఇలా అవిశ్వాస తీర్మానాలు పెట్టడం గమనార్హం. 

ఉపసర్పంచ్​లకు ఒక రకం.. ఎంపీపీలకు ఇంకోరకం 

పంచాయతీరాజ్​ చట్టాన్ని ఇటు ప్రభుత్వం, అటు ఎమ్మెల్యేలు ఇష్టంవచ్చినట్లు వాడుకుంటున్నారు. 2018-కొత్త పంచాయతీరాజ్​ చట్టంలో నాలుగే ళ్ల పదవీ కాలం తర్వాత అవివ్వాస తీర్మానం పెట్టొచ్చని స్పష్టంగా ఉంది. కానీ ఈ చట్టానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి రూల్స్​ రూపొందించ లే దు. దీంతో పాత చట్టం ప్రకారమే అవిశ్వాస తీర్మానం ఆమోదించి ఎంపీపీ లను పదవి నుంచి తొలగించవచ్చనే క్లాజ్​ కొత్త చట్టంలోనూ ఉంటుందని ఆర్డీఓలు చెబుతున్నారు. దీని ప్రకారమే చాలాచోట్ల  ఉప​ సర్పంచ్​ల పైన అవిశ్వా స తీర్మానం పెట్టి పదవుల నుంచి దింపారు. ఇప్పుడు అదే చట్టం ఎంపీపీ ల విషయంలో ఎందుకు అడ్డు వస్తోందని ఎంపీటీసీలు ప్రశ్నిస్తున్నారు. కొత్త చట్టం రూల్స్​ రూపొందించలేదనే కారణాన్ని సాకుగా చూపించి పలువురు ఎంపీపీలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నారని ఆఫీసర్లు చెబుతున్నారు.