- మద్దతు కోసం కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు
- గైర్హజరయ్యేలా చూడాలని చైర్పర్సన్ ఎత్తులు
- రేపు చైర్‌పర్సన్‌పై అవిశ్వాస పరీక్ష
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస వ్యవహారం ఉత్కంఠగా మారుతోంది. బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్ల నిర్ణయం మీదే చైర్పర్సన్ భవితవ్యం ఆధారపడిఉంది. అవిశ్వాసం మీద ఓటింగ్ కోసం కలెక్టర్ ఈనెల 30న సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి 27 మంది కౌన్సిలర్ల బలముంది. అవిశ్వాసం మీద ఓటింగ్ కోసం మీటింగ్ నిర్వహించాలంటే 34 మంది కౌన్సిలర్లు హాజరుకావాల్సిఉంటుంది. కోరం పూర్తి కావాలంటే మరో ఏడుగురు హాజరుకావాలి. దీంతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
క్యాంపులో ఉన్న బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మున్సిపల్ వైన్ చైర్‌పర్సన్‌తోపాటు పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో 16 మంది మిగిలారు. ఇందులో 9 మంది చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి పట్ల అసంతృప్తితో ఉన్నారు. వారు వారం రోజులుగా క్యాంపులో ఉన్నారు. అసమ్మతివాదులు పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాసం మీటింగ్‌కు గైర్హాజరయ్యేలా చూడాలని చైర్పర్సన్ వర్గం ప్రయత్నాలు చేస్తోంది.
జాహ్నవి తండ్రి, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ నిట్టు వేణుగోపాల్‌రావు కేటీఆర్‌ను కలిసి పరిస్థితి వివరించారు. దీంతో 9 మంది కౌన్సిలర్లను వెనక్కి రప్పించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా ప్రెసిడెంట్ ముజీబొద్ధిన్కు కేటీఆర్సూచించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు హాజరుకాకపోతే కోరం లేక మీటింగ్ వాయిదా పడి.. అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంది.
హైకోర్టుకు చైర్పర్సన్?
అవిశ్వాస పరీక్షపై స్టే కోరుతూ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌కు చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
గోవా క్యాంపులో ఉన్న 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం వరకు హైదరాబాద్‌లోనే మకాం వేసి.. మీటింగ్ టైంకు నేరుగా మున్సిపల్ ఆఫీసుకు రానున్నారు. గోవాలోనే క్యాంపులో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా గురువారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.