మేయర్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాస తీర్మానం

మేయర్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాస తీర్మానం
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల సంతకాలతో కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు వినతి

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మేయర్ సునీల్‌‌‌‌రావుపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు కలెక్టర్ పమేలా సత్పతికి సోమవారం దరఖాస్తు చేశారు. మంగళవారంతో పదవీకాలం ముగియనుండగా.. ఒక్క రోజు ముందు అవిశ్వాసానికి సిద్ధం కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. మేయర్ ఈ నెల 25న శనివారం బీఆర్ఎస్‌‌‌‌ను వీడి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. 

ఆయనతోపాటు 10 మంది, 2‌‌‌‌‌‌‌‌మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ కేవలం ఇద్దరు మాత్రమే వెంట వెళ్లారు. 20 మంది వరకు చేరడానికి వచ్చినప్పటికీ.. వారిపై భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు ఉన్న కారణంగానే చేర్చుకోలేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.  ఈక్రమంలో మేయర్ వెంట మెజార్టీ కార్పొరేటర్లు లేరనే సంకేతాలు ఇచ్చేందుకే 31 మంది కార్పొరేటర్ల సంతకాలతో కూడిన వినతిపత్రం కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చినట్లు తెలిసింది. కౌన్సిల్‌‌‌‌ను సమావేశపరిచే వ్యవధి కూడా లేనప్పటికీ.. తామంతా ఒక్కతాటిపై ఉన్నామని చెప్పేందుకే అవిశ్వాసం పేరిట హడావుడి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

వీడ్కోలు సమావేశంపై ఉత్కంఠ

మేయర్, డిప్యూటీ మేయర్ సహా 60 మంది కార్పొరేటర్ల పదవీకాలం నేటితో ముగియనుంది. పదవీకాలం ముగింపు సందర్భంగా మేయర్ అధ్యక్షతన సమావేశం కావడం, అందరికి సన్మానాలు చేయడం, గ్రూప్ ఫొటోలు దిగడం ఆనవాయితీగా వస్తోంది. మేయర్‌‌‌‌‌‌‌‌పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహణ తీరుపై ఉత్కంఠ నెలకొంది.