తుది అంకానికి భువనగిరి అవిశ్వాసం

  •     23న భువనగిరి మున్సిపల్​సమావేశం
  •     చైర్మన్​, వైస్​చైర్మన్​కు పదవీ గండం

 యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో కొద్దిరోజులుగా కొనసాగుతున్న  అవిశ్వాస రాజకీయం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. మున్సిపల్​ చైర్మన్​ ఎనబోయిన ఆంజనేయులు, వైస్​ చైర్మన్​ చింతల కిష్టయ్యపై సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మేరకు బల నిరూపణకు తేదీ ఖరారైంది. తెలంగాణ మున్సిపల్​ యాక్ట్​ 2019 ప్రకారం ఈ నెల 23న అవిశ్వాసంపై సమావేశం నిర్వహిస్తామని యాదాద్రి కలెక్టర్​ హనుమంతు జెండగే శుక్రవారం స్పష్టం చేశారు. దీంతో చైర్మన్​, వైస్​చైర్మన్లకు పదవీ గండం పొంచి ఉంది.  

ఇండిపెండెంట్ల సాయంతో బీఆర్ఎస్​ పాగా.. 

భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులున్నాయి. 2020లో జరిగిన మున్సిపల్​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​15 సీట్లు గెలిచింది. కాంగ్రెస్​ 11, బీజేపీ 7 సీట్లు సాధించగా, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. 15 మంది  బలమే ఉండడంతో బీఆర్ఎస్​ ఇద్దరు ఇండిపెండెంట్లను చేర్చుకుంది. ఎక్స్​అఫీషియో మెంబర్లుగా ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓట్లతో చైర్మన్​, వైస్​ చైర్మన్​ పదవులను  ​బీఆర్ఎస్ దక్కించుకుంది.  

అనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్​కు చెందిన ఇద్దరు, బీజేపీకి చెందిన ఒకరు బీఆర్ఎస్​లో చేరడంతో ఆ పార్టీ బలం 20కి చేరింది. చైర్మన్​, వైస్​ చైర్మన్లుగా రాయగిరికి చెందిన ఎనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్యకు అప్పగించడంతో భువనగిరి టౌన్​కు చెందిన కౌన్సిలర్లు అసంతృప్తికి లోనయ్యారు. మూడేండ్ల పాటు ఓపిక పట్టి  గతేడాది జనవరి లో చైర్మన్​, వైస్​చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ అప్పటి కలెక్టర్​ పమేలా సత్పతికి నోటీసులు అందించారు. కానీ రంగంలోకి దిగిన అప్పటి ఎమ్మెల్యేలు అసంతృప్తులతో మాట్లాడి సర్దిచెప్పారు.   

తాజాగా తెరపైకి అవిశ్వాసాలు..

అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్​ఎస్​ ఓడిపోయి కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో మరోసారి అవిశ్వాస అంశం తెరపైకి వచ్చింది. భువనగిరి చెందిన బీఆర్​ఎస్​ అసంతృప్త కౌన్సిలర్లు 16 మంది, కాంగ్రెస్​కు చెందిన తొమ్మిది మందిని,  బీజేపీకి చెందిన ఆరుగురిని కలుపుకొని మొత్తంగా 31 మంది  గత నెల 27న మరోసారి అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డికి అవిశ్వాస తీర్మానాన్ని అందించారు.  దీంతో అన్నీ పరిశీలించిన ఆయన, ఈ నెల 23న ఉదయం 11 గంటలకు అవిశ్వాస మీటింగ్​ ఏర్పాటు చేశారు. అసంతృప్త కౌన్సిలర్లు ఎక్కువగా ఉండడంతో  చైర్మన్​, వైస్​చైర్మన్​లిద్దరూ పదవులు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది.

పెండింగ్​లోనే ఆలేరు..?

ఆలేరు మున్సిపల్​చైర్మన్​ వస్పరి శంకరయ్యపై బీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​కౌన్సిలర్లు గతేడాది జనవరిలో అవిశ్వాసం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈకక్రమంలో వారంతా కలెక్టర్​ హనుమంతు జెండగే, అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డిని కలిశారు. సమావేశంపై ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా చౌటుప్పల్​, యాదగిరిగుట్ట చైర్మన్లు కాంగ్రెస్​లో చేరడంతో అవిశ్వాస గండం నుంచి తప్పించుకున్నట్లయింది.