నో కాస్ట్ ఈఎంఐతోనూ మిత్తి
డ్యూ డేట్ లోపు కట్టే వారికి ‘బై నౌ పే లేటర్’ బెటర్
ఈ నెల 16 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్, అమెజాన్ ప్రైమ్ డేస్ స్టార్టవుతున్నాయి. చాలా ప్రొడక్ట్‌లపై నో కాస్ట్ ఈఎంఐ, బై నౌ పే లేటర్ స్కీమ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ స్కీమ్‌ల వలన కస్టమర్‌కు ప్రయోజనం ఉంటుందా? నో కాస్ట్ ఈఎంఐని ఎంచుకోవడం వలన అసలు వడ్డీనే పడదా? దీనికి సమాధానం పడుతుందనే చెప్పాలి. నో కాస్ట్ ఈఎంఐ, బై నౌ పే లేటర్ ఎలా పనిచేస్తాయో కింద చూడొచ్చు..
బిజినెస్ డెస్క్, వెలుగు: బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు జీరో శాతం వడ్డీకి లోన్లు ఇవ్వొద్దని 2013లో ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. అందువలన ఆన్‌లైన్ సైట్లలో కనిపించే నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్‌ల వలన వడ్డీ ఉండదనుకుంటే అది భ్రమే. నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్ రెండు విధాలుగా పనిచేస్తుంది. మొదటి విధానంలో ప్రొడక్ట్‌పై సెల్లర్లిచ్చే డిస్కౌంట్ కస్టమర్ ఎంచుకున్న బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ కంపెనీలకు వెళ్లిపోతుంది. అంటే ఒక ప్రొడక్ట్‌ను మొత్తం డబ్బులు ముందే పే చేసి తీసుకుంటే వచ్చే డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ కోసం వాడే బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ కంపెనీకి వెళుతుందన్న మాట. ఉదాహరణకు ఒక మొబైల్ ఫోన్ ధర రూ. 30,000 అనుకుందాం. ఒకే సారి డబ్బులు చెల్లిస్తే రూ. 25,500 కే ఈ ప్రొడక్ట్ వస్తుందనుకుంటే, ఈ డిస్కౌంట్ డబ్బులు రూ. 4,500 లు బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ కంపెనీకి వెళ్లిపోతాయి. అంటే కస్టమర్‌కు రావాల్సిన డిస్కౌంట్ వడ్డీ కింద బ్యాంకులకు చేరుతుంది. రెండో విధానంలో ప్రొడక్ట్‌పై విధించే వడ్డీ ముందుగానే ప్రొడక్ట్ ధరలో కలిసి ఉంటుంది. అంటే ఈ విధానంలో సెల్లర్‌కు చెల్లించే మనీ, బ్యాంకులకు చెల్లించే వడ్డీ రెండు కలిసే ఉంటాయి. ఒక మొబైల్ కాస్ట్ రూ. 15,000 అనుకుంటే, నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకున్నప్పుడు ఆ ప్రొడక్ట్ ధర రూ. 17,500 కు పెరిగిందనుకుందాం. ఈ విధానంలో అదనంగా పడే ఖర్చు రూ. 2,500 లు బ్యాంకులకు కస్టమర్ చెల్లించే వడ్డీ అన్న మాట. కొన్ని సార్లు ఈ వడ్డీ ప్రాసెసింగ్ ఛార్జీల పేరు మీద కూడా ప్రొడక్ట్ ధరలో కలిసుంటుంది
బై నౌ, పే లేటర్…
బై నౌ, పే లేటర్ స్కీమ్ కింద బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు కస్టమర్లకు అప్పు ఇస్తుంటాయి. ముందే నిర్ణయించిన టైమ్‌లోపు(డ్యూ డేట్) ప్రొడక్ట్ ధరను చెల్లిస్తే ఎటువంటి వడ్డీ పడదు. ప్రొడక్ట్ ధరను ఈఎంఐల కింద కట్టుకుందామనుకుంటే భారీగా వడ్డీ పడుతుంది. ఫైనాన్షియల్ సంస్థను బట్టి ఈ వడ్డీ రేటు 36 శాతం వరకు కూడా ఉంటుంది. అమెజాన్ బై నౌ పే లేటర్ స్కీమ్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఈ స్కీమ్ ఎంచుకున్న కస్టమర్, ప్రొడక్ట్‌ను కొన్న నెలరోజుల లోపు ఆ ప్రొడక్ట్ డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. ఈ టైమ్ పిరియడ్‌లో కస్టమర్‌కు ఎటువంటి వడ్డీ భారం ఉండదు. ఈ ప్రొడక్ట్ ధరను ఈఎంఐల కింద కట్టుకుంటానంటే మాత్రం వడ్డీని వేస్తారు. కస్టమర్ల క్రెడిట్ ప్రొఫైల్‌ను బట్టి ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
బై నౌ పే లేటర్ ఎంచుకుంటే..
కస్టమర్ బై నౌ పే లేటర్ స్కీమ్‌ను ఎంచుకుంటే ప్రొడక్ట్‌పై డిస్కౌంట్లను తీసేయగా మిగిలిన డబ్బులపై ఈఎంఐ పడుతుంది. అప్పుడు 10 శాతం డిస్కౌంట్ వచ్చినప్పుడు రూ. 90 వేలను ఈఎంఐల కింద కట్టాల్సి ఉంటుంది. 15 శాతం డిస్కౌంట్ వచ్చినప్పడు రూ.85,000 కట్టాల్సి ఉంటుంది. 12 ఈఎంఐలపై వడ్డీరేటు 30 శాతం విధిస్తే రూ. 90 వేల అమౌంట్‌ను రూ. 8,774 లను ఒక్కో ఈఎంఐగా కట్టాల్సి ఉంటుంది. అదే రూ. 85 వేలపైనైతే రూ. 8,286 ను ఒక్కో ఈఎంఐగా కట్టాల్సి ఉంటుంది. ఈ రెండు స్కీమ్‌లలో ఏది ఎంచుకున్న హిడెన్ ఛార్జీలు ఏమైన ఉన్నాయో లేదో కస్టమర్లు జాగ్రత్తగా చూడాలి. నో కాస్ట్ ఈఎంఐ కంటే పే లేటర్ స్కీమ్ పారదర్శకంగా ఉంది కాబట్టి, బ్యాంకులు ఇచ్చిన టైమ్‌లోనే తిరిగి డబ్బులు చెల్లించగలిగితే ఈ స్కీమే బెటర్.
లెక్కలు చూద్దాం..
ఒక కస్టమర్ రూ. లక్ష విలువైన స్మార్ట్‌ఫోన్‌ను క్రెడిట్ కార్డు ద్వారా కొన్నాడనుకుందాం. ఈ ధరను 12 ఈఎంఐ కింద కన్వర్ట్ చేశాడనుకుంటే ఈ రెండు స్కీమ్‌లలో కస్టమర్‌కు ఎంత పడుతుందో అంచనావేద్దాం.
నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్ ఎంచుకుంటే..
ఈ కస్టమర్ నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్‌ను ఎంచుకున్నాడనుకుందాం. ఈ ఫోన్ ధరను ఒకేసారి చెల్లిస్తే 10 శాతం, 15 శాతం డిస్కౌంట్లను సెల్లర్ ఇస్తున్నాడని అనుకుందాం. 10 శాతం డిస్కౌంట్ వద్ద రూ. లక్ష ఫోన్ రూ. 90 వేలకే కస్టమర్‌కు వస్తుంది. అదే 15 శాతం డిస్కౌంట్ వద్ద రూ. 85 వేలకే వస్తుంది. కానీ కస్టమర్ 12 నెలలకు నో కాస్ట్ ఈఎంఐను ఎంచుకున్నాడు కాబట్టి డిస్కౌంట్ కస్టమర్ ఎంచుకున్న బ్యాంకుకు వెళుతుంది. అంటే 12 నెలల ఈఎంఐకి గాను బ్యాంకుకు రూ. 10 వేలు వడ్డీగా వెళ్లిపోతుంది. అదే 15 శాతం డిస్కౌంట్ ఉంటే బ్యాంకుకు రూ. 15 వేలు వడ్డీ కింద కడతాడు. ఒక ప్రొడక్ట్‌పై ఎంత డిస్కౌంట్ ఎక్కువగా ఉంటే అంతెక్కువ బ్యాంకుకు వడ్డీ కింద వెళుతుంది. ఈ రెండు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నా, కస్టమర్ మాత్రం స్మార్ట్‌ఫోన్‌పై రూ. లక్షనే ఈఎంఐల కింద కట్టాల్సి ఉంటుంది. ఈ లక్షను రూ. 8,333 ఈఎంఐ కింద 12 నెలలు కట్టాలి.