ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి మహాయుతి కూటమి విజయ సంబరాల్లో ఉండగానే.. మహారాష్ట్ర సిట్టింగ్ సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మహాయుతి కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే షిండే చేసిన వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపుతున్నాయి. సీట్లు ఎక్కువ వస్తే సీఎం కావాలని లేదని షిండే చేసిన వ్యాఖ్యలు కూటమిలో కాక రేపుతున్నాయి. కూటమి విజయంలో షిండేదే కీలక పాత్ర అని షిండే శివసేన వర్గం బల్లగుద్ది మరీ చెబుతోంది.
Also Read :- మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
సీట్లకు, సీఎం పదవికీ సంబంధం లేదని, సీఎం పదవిపై మిగతా పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలతో కూటమిలో దుమారం రేగింది. మళ్లీ సీఎం షిండేనే అంటూ ఒకపక్క శివసేనలోని ఆయన వర్గం సంబరాల్లో మునిగిపోయింది. షిండే లేకపోతే బీజేపీకి గెలుపు లేదని శివసేనలోని షిండే వర్గం గట్టిగా వాదిస్తోంది. మహాయతి ఏర్పాటులో షిండేదే కీ రోల్ అని తేల్చి చెబుతున్న పరిస్థితి. సీఎం పదవిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలపై మరాఠా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కూటమిలోని అన్ని పార్టీలు తమ పార్టీ నేతే సీఎం అంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కూటమిలోని శివసేన (షిండే) అధికార ప్రతినిధి సంజయ్ షిర్సత్ మాట్లాడుతూ.. ఏక్నాథ్ షిండే సీఎం అనే నినాదంతోనే ఎన్నికలను ఎదుర్కొన్నట్టు చెప్పారు. షిండేను చూసే మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమికి ఓట్లేశారని అన్నారు. మహారాష్ట్రకు మళ్లీ షిండే సీఎం అవుతారని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్సీఎం అవుతారని బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ అన్నారు.
బీజేపీ నుంచి ఎవరైనా సీఎం పదవి చేపట్టాల్సి వస్తే అది దేవేంద్ర ఫడ్నవీసేనని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్సీపీ చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పేరును ఆ పార్టీ నేత అమోల్ మిట్కారీ సీఎం రేసులోకి తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ కింగ్ మేకర్ అవుతుందని చెప్పారు. కాగా, పుణెలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నెక్ట్స్ మహారాష్ట్ర సీఎం అంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ పోస్టర్లను ఎన్సీపీ నేత సంతోష్ నంగారే ఏర్పాటు చేయగా.. నిమిషాల్లోనే వైరల్గా మారాయి.