మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు: సీపీ సుధీర్ బాబు

మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు: సీపీ సుధీర్ బాబు

హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్ బాబు అరెస్ట్‎పై రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. సోమవారం (డిసెంబర్ 16) ఎల్బీనగర్‎లోని సీపీ క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచు కుటుంబ వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు మూడు ఎఫ్ఐఆర్‎లు నమోదు అయ్యాయని.. వీటిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యమేమి లేదని.. 24వ తేదీ వరకు కోర్టు ఆయనకు టైం ఇవ్వడంతో అరెస్ట్ చేయలేదని చెప్పారు. మోహన్ బాబును విచారించేందుకు మేం కోర్టును అనుమతి అడుగుతామని పేర్కొన్నారు. మోహన్ బాబు వద్ద ఉన్న గన్‎లు చంద్రగిరిలో ఉన్నపుడు తీసుకున్నవని.. రాచకొండ నుండి ఆయనకు ఎలాంటి గన్ పర్మిషన్స్ లేవని క్లారిటీ ఇచ్చారు.

Also Read:-స్పీకర్ ఛాంబర్లో బీఏసీ భేటీ.. హాజరైన సీఎం రేవంత్, హరీశ్..

మోహన్ బాబు వద్ద మొత్తం రెండు లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయి.. ఒకటి డీబీపీఎల్, మరొకటి స్పానిష్ మేడ్ గన్ ఉందని చెప్పారు. కోర్టు మినహాయింపు అయిపోయాక మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇస్తామని.. అప్పుడు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. పోలీసుల ముందుకు హాజరయ్యేందుకు మళ్ళీ టైం కావాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లేదంటే మోహన్ బాబుకు అరెస్ట్ వారంటీ ఇష్యూ చేస్తామని చెప్పారు. 

మోహన్ బాబు 2024, డిసెంబర్ 15న వెళ్లి పిటిషనర్‎ని కలిశాడని.. దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని తన నివాసం దగ్గర జర్నలిస్టుపై దాడి చేయడంతో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసుల ముందు హాజరయ్యేందుకు ఈ నెల 24వ తేదీ వరకు హైకోర్టు మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చింది. ఈ నెల 24 తర్వాత మోహన్ బాబుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి.