రూ.67 వేల కోట్లు ఖర్చుపెడితే.. సిటీ ఇట్లనే ఉంటదా?

హైదరాబాద్​ను అభివృద్ధి చేయకుంటే అసలు ఓటే అడగబోమని గత గ్రేటర్​ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్, కేటీఆర్​ హామీ ఇచ్చారు. కానీ ఐదేండ్లయినా హైదరాబాద్​ రూపు మారలేదు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. చిన్న వానకే సిటీ ఆగమాగం అవుతోంది. మొన్న వచ్చిన భారీ వర్షాలకు జనం నానా అవస్థలు పడ్డారు. అభివృద్ధి చేయకుంటే ఓటడగమని చెప్పిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ఓట్లడుగుతున్నారు. అసలు టీఆర్ఎస్  పార్టీకి ఓటు అడిగే అర్హతే లేదు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అధికార పార్టీకి బుద్ధి చెప్పి.. పక్కన పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించారు.

హైదరాబాద్ సిటీని విశ్వనగరంగా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ టీఆర్ఎస్ ఇన్నేండ్లలో కొత్తగా సిటీలో తెచ్చిన మార్పేమీ లేదు. చిన్న వానకే రోడ్లపై నీళ్లు నిలుస్తున్నయ్. ఇక భారీ వర్షం పడిందంటే ఏకంగా ఇండ్లు మునిపోతున్నయ్. ఒక్క హైదరాబాద్ లోనే రూ.67 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు. అంత ఖర్చు చేస్తే సిటీ ఇట్లనే ఉంటదా? మోసపు మాటలు తప్ప పని కనిపించడం లేదు. అభివృద్ధి చేయకుంటే మళ్లీ ఓట్లు అడగమని చెప్పిన మీరు ఈ రోజు ఏం మొహం పెట్టుకుని జనం దగ్గరకు వస్తున్నారు.

ఐదేండ్లలో వచ్చిన మార్పేంటి?

గత బల్దియా ఎలక్షన్లలో నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మేయర్ కుర్చీ గెలుచుకోవడం ఖాయమనే ధీమాతో ఉంది. గతంలో ఇక్కడ టీఆర్ఎస్ కు ఎన్ని సీట్లు ఉన్నాయన్నది ఒకసారి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తామని, డల్లాస్ గా మారుస్తామని, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, పేదలందరికీ డబుల్ ఇండ్లు ఇస్తామని టీఆర్ఎస్​ నేతలు హామీలు ఇచ్చారు. కానీ, ఈ ఐదేండ్లలో వాళ్లు చేసిందేమీ లేదు. ‘వర్షం వస్తే హైదరాబాద్ లో రోడ్లు చెరువులైతయ్, కార్లు పడవలైతయ్. అసెంబ్లీ ముందు కూడా మోకాళ్ల లోతు నీళ్లు ఉంటున్నయ్’ అని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్.. సీఎం అయిన తర్వాత ఈ ఐదేండ్లలో తీసుకొచ్చిన మార్పేంటి?

అభివృద్ధి ఎక్కడా కనపడట్లే

రూ.67 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు. ఆ డబ్బు అంతా ఎక్కడ ఖర్చు పెట్టారు? సిటీలో ఎక్కడైనా అభివృద్ధి కనపడుతోందా? అక్కడొకటి అక్కడొకటి ఫ్లై ఓవర్లు కట్టేసి హైదరాబాద్ అంతా అభివృద్ధి చేసేశామని మోసపు మాటలు చెబితే ఎలా? ఎక్కడ, ఎంత ఖర్చు పెట్టారో జనానికి చూపెట్టాలి కదా. రూ.12 వేల కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్​లో వర్షం వస్తే నీళ్లు ఆగకుండా వెళ్లిపోతాయని, డ్రైనేజీ సిస్టం మొత్తం మారిపోతుందని గతంలో టీఆర్ఎస్ నేతలు చెప్పారు. రూ.12 వేల కోట్లు కాదు.. రూ.67 వేల కోట్లు ఖర్చుపెట్టామని అంటున్నారు కానీ సిటీ ఎందుకు మారలేదు. అంత డబ్బు ఖర్చు పెడితే చిన్న వానకే ఎందుకు మునిగిపోతోంది.

టీఆర్ఎస్​ మోసాలను ఎండగడతాం

అసలు ఏ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్న దానిపై టీఆర్ఎస్​కు ఒక ఆలోచన లేదు. లోతట్టు ప్రాంతాల్లో నాలాల మీద ఆక్రమణల వల్ల నీళ్లు వస్తున్నాయని, ఇండ్లు మునుగుతున్నాయని చెప్పారు. నాలాలను, చెరువులను ఆక్రమించుకుని కట్టుకున్న ఇండ్లను తొలగిస్తామన్నారు. ఆ ప్రాంతాల్లో నివసించే పేదలందరికీ డబుల్ ఇండ్లు ఇస్తామన్నారు. కానీ, ఈ రోజుకీ ఆ కబ్జాలను తొలగించి ఎక్కడైనా ఒక్కరి కన్నా ఇండ్లు ఇచ్చారా? గత ఎన్నికల్లో చెప్పిన ఒక్క హామీ అయినా ఆ పార్టీ నేతలు నెరవేర్చారా?  మోసం చేసిన టీఆర్ఎస్ ని అడుగడుగునా ఎండగడతాం.

ఆదరాబాదరాగా ఎన్నికలెందుకు

ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటే ఇప్పుడు ఆదరాబాదరాగా ఎలక్షన్లకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది. వరద సాయం అందాల్సిన ప్రతి ఒక్కరికీ పది వేలు చెల్లించిన తర్వాతే ఎన్నికలకు పోవాల్సింది. అధికారం ఆయన చేతిలోనే పెట్టుకుని బీజేపీ అడ్డుకుంటోందని చెబుతుందంటే.. ఇంతకంటే దద్దమ్మ ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా? ఎలక్షన్ కమిషన్ తో కోఆర్డినేట్ చేసుకుని ఎన్నికలను తర్వాత పెట్టుకోవడం కూడా చేతకాదా? ప్రజలను మోసం చేయడానికి ఈ మాటలు చెబితే ఎలా? మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకే ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందంటే ఎలా? గతంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకే ఓటేశారు కదా. ఇంకెన్నిసార్లు జనాన్ని మోసం చేస్తరు. గతంలో చెప్పిన హామీలను అమలు చేసుంటే హైదరాబాద్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదు. హామీలు అమలు చేయకపోవడంతో మొహం చెల్లకనే కేసీఆర్​ బయటకు రావడం లేదు.

కాంగ్రెస్​ను జనం నమ్మడం లేదు

కాంగ్రెస్​ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఆ పార్టీ గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితిలో కూడా లేరు. ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రజలకు ఆ పార్టీ భరోసా ఇవ్వలేకపోతోంది. ప్రతిపక్షంగా కాంగ్రెస్​ ఫెయిల్​ అయ్యింది. కాంగ్రెస్​లో​ ఎవరు గెలిచినా టీఆర్ఎస్​లో చేరుతున్నారు. అందువల్ల ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదు. టీఆర్ఎస్​కు ఓటేస్తే మజ్లిస్​కు ఓటేసినట్టే. భాగ్యనగరాన్ని పాత బస్తీ చేయాలనుకుంటున్నారా? భాగ్యనగరాన్ని భాగ్యనగరంగానే ఉంచాలనుకుంటున్నారో ప్రజలే నిర్ణయించుకోవాలి. హైదరాబాద్​ పాతబస్తీలా కావొద్దనుకునే ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేస్తారు.

కేసీఆర్​కు భయం పట్టుకుంది

బీజేపీని చూసి కేసీఆర్​కు భయం పట్టుకుంటోంది. ఇంతకుముందు బీజేపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న కేసీఆర్.. ఇప్పుడు బీజేపీపై యుద్ధం చేస్తానంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. దుబ్బాక ఎన్నిక ప్రభావం కచ్చితంగా జీహెచ్​ఎంసీపై ఉంటుంది. రాష్ట్రంలో టీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని గ్రామీణ ప్రాంతాల ప్రజలే తీర్పు ఇచ్చారు. తెలంగాణలో ప్రజలు కోరుకుంటున్న పార్టీ బీజేపీనే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కూడా బీజేపీనే. బీజేపీలోకి త్వరలో పెద్ద ఎత్తున వలసలు ఉంటాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలన్నీ ప్రజల్లోకి తీసుకెళతాం. 2023లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తప్పకుండా దుబ్బాక ఎన్నిక, జీహెచ్​ఎంసీ ఎన్నికలు స్ఫూర్తిగా నిలుస్తాయి. తెలంగాణ ప్రజలంతా ఆల్టర్​నేటివ్​ ఎవరనే దానికి బీజేపీ వైపే చూస్తున్నారు.

ఇలాంటి సీఎంతో ఏం లాభం

మొన్న హైదరాబాద్ వరదల్లో ప్రజలు పడిన ఇబ్బందులను తెలుసుకునేందుకు ఎక్కడైనా ఒక్క చోటన్నా కాలనీల్లో సీఎం కేసీఆర్ పర్యటించారా? భారీ వర్షాలకు ప్రజల ఇండ్లు మునిగిపోతే వచ్చి పరిశీలించాల్సిన బాధ్యత సీఎంగా ఆయనకు లేదా? రాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు.. రాష్ట్ర రాజధానిలో ఇలా జరిగినా పట్టించుకోకుండా ఉన్నారంటే ఇక ఆ సీఎం ఉండి ఎందుకు. ఈ రోజు పది వేల రూపాయలు వరద సాయం ప్రకటించారు. దానిని బీజేపీ అడ్డుకుంటోందని అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. వరదలు ఎప్పుడొచ్చినయ్.. రూ.పది వేల సాయం ఎప్పుడు ప్రకటించారు. వరద సాయం పేరుతో పది వేలు ఇచ్చి ఓట్లు దండుకుందామనే ఆలోచనతో టీఆర్ఎస్​ నేతలు ఉన్నారు తప్ప.. ప్రజలకు సాయం చేద్దామనే ఉద్దేశం వారికి లేదు.

      – డీకే అరుణ బీజేపీ నేషనల్​ వైస్​ ప్రెసిడెంట్