- బీఆర్ఎస్ లీడర్ల వెంచర్లకు డిమాండ్ పెంచేందుకేననే అనుమానాలు
పాలమూరు జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి క్షేత్రాన్ని పక్కనపెట్టి కేవలం మన్యంకొండ టెంపుల్‌ను మాత్రమే ప్రభుత్వం డెవలప్ చేస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. మన్యంకొండ ఆలయం, దాని చుట్టుపక్కల చేస్తున్న అభివృద్ధిని ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ అంతకంటే పెద్దక్షేత్రం కురుమూర్తిని కాదని, మన్యంకొండను ముందుకు తేవడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా మన్యం కొండ చుట్టూ వందల ఎకరాలను కొనుగోలు చేసిన రూలింగ్ పార్టీ లీడర్లు భారీ వెంచర్లు వేశారు. కానీ వాటికి డిమాండ్లేకపోవడంతో మన్యం కొండ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను తెరమీదకు తెచ్చినట్లు చెప్పుకుంటున్నారు.
మహబూబ్‌నగర్, వెలుగు: మహబూబ్‌నగర్‌జిల్లా అమ్మాపూర్ గ్రామ శివారులోని కురుమూర్తి క్షేత్రాన్ని రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి ఏపీలో 1996 నుంచి 1999 మధ్య జరిగిన అభివృద్ధి తప్ప, స్వరాష్ట్రంలో డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించడం లేదు. తొమ్మిదేళ్ల కాలంలో కేవలం రాజగోపురం నిర్మాణానికి రూ.1.2 కోట్లు మినహాయిస్తే.. ఎలాంటి పనులకు ఫండ్స్ రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఉన్న గర్భగుడి పునర్నిర్మాణం, విశ్రాంతి గదులు, సత్రం, కల్యాణకట్ట అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి హయాంలో నిర్మించినవే. ఐదేళ్ల కింద జరిగిన కోనేరు పునర్నిర్మాణం, అమ్మాపూర్ గ్రామం నుంచి ఆలయం వరకు వేసిన కిలోమీటరున్నర రోడ్డు, గుట్ట కింద నుంచి గర్భగుడి వరకు వేసిన మెట్లు, మెట్ల మార్గంలో వేసిన షెడ్లు, తాగునీటి కోసం ట్యాంకులు, దాసంగాలు పెట్టేందుకు రేకులషెడ్లు, వంట శాలలు, 15 విశ్రాంతి గదులను దాతల సహకారంతో నిర్మించారు. ఎండోమెంట్ఆఫీసర్లు చెప్పిన లెక్కల ప్రకారం ఈ క్షేత్రానికి విరాళాల ద్వారా ప్రతి నెలా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు.. బ్రహ్మత్సవాల సందర్భంలో రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. మొత్తంగా ఏడాదిలో రూ.2.5 కోట్ల వరకు వస్తుందని చెబుతున్నారు. ఇంత ఆదాయం వస్తున్నా జిల్లా లీడర్లు ఈ క్షేత్రం అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు ఆలయ మాన్యం భూములు వందల ఎకరాలు కబ్జాలో ఉన్నా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మన్యంకొండపై స్పెషల్ ఫోకస్
మన్యంకొండపైనే బీఆర్ఎస్లీడర్లు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అది కూడా ఏడాదిగా ఇక్కడ డెవలప్మెంట్పనులకు ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇప్పటికే ఓబులేశ్వర ఆలయాన్ని రూ.70 లక్షలతో పునరుద్ధరించారు. ధ్వజస్తంభం, ఆర్చి, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు. రూ.2 కోట్లతో ఏసీ కల్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబరులో గుట్ట కింద నుంచి పైవరకు బీటీ రోడ్డు వేశారు. ఎన్‌హెచ్-167 నుంచి జాతర మైదానం వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మించారు. సెంట్రల్ లైటింగ్ఏర్పాటు చేశారు. గుట్ట మీద ప్రభుత్వ నిధులతో 18 విశ్రాంతి గదులు నిర్మించారు. ప్రస్తుతం కొండకు చేరేందుకు ఒక ఘాట్‌రోడ్డు ఉండగా, మరో ఘాట్ రోడ్డు కోసం రూ.2 కోట్లతో ప్రతిపాదించారు. రోప్ వే,లేక్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, మౌలిక సదుపాయాల కోసం రూ.50 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు రెడీ చేశారు. అలాగే అన్నదాన సత్రం, పార్కుల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నారు.
భూముల రేట్లు పెంచుకోవడానికే..
2019 నుంచి 2021 వరకు మన్యంకొండ, ఎన్‌హెచ్-167 వెంట రూలింగ్ పార్టీ లీడర్లు వందల ఎకరాల్లో భూములు కొన్నారు. ఒక్కో ఎకరాకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు పెట్టారు. మహబూబ్‌నగర్, దేవరకద్ర మధ్యలో మినీ ఎయిర్‌పోర్టు వస్తే భూములకు రేట్లు వస్తాయని అందరూ భావించగా, ఎయిర్ పోర్ట్ఆఫ్అథారిటీ ప్రపోజల్స్‌ను రిజెక్ట్ చేసింది. రియల్వెంచర్లు వేయగా ప్లాట్లు అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంతకాలంగా మన్యంకొండ వద్ద డెవలప్‌మెంట్ పేరుతో బీఆర్ఎస్ లీడర్లు హడావిడి చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లుగా లేనిది ఎన్నికలకు ముందు డెవలప్మెంట్పనులు ఎందుకు చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. దీనికితోడు సాధ్యమైనంత వరకు ఈ ఏరియాను అభివృద్ధి చేసి, భూములకు రేట్పెంచాలనే యోచనలో లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.