- ఏడాదైనా పూర్తి కాని మొదటి విడత పనులు
- టెండర్ దశలోనే ఆగిన రెండో విడత
- తాజాగా మరో 47 బిల్డింగ్ లకు నిధులు మంజూరు
- జనగామ జిల్లాలో మొత్తం 77 బిల్డింగ్ లకు ఆమోదం
జనగామ, వెలుగు
గ్రామాల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన పల్లె దవాఖానాల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఏడాది క్రితం మొదలు పెట్టిన తొలి విడతలో ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి కాకపోగా, రెండో విడతగా మంజూరైన బిల్డింగ్ లు ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి. ఇప్పుడు మూడో విడతగా మరో 47 బిల్డింగ్ లను మంజూరు చేశారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు స్లోగా జరుగుతుండడంతో వైద్య శాఖ ఆఫీసర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మొదటి విడతలో ఒక్కటీ పూర్తి కాలే...
జనగామ జిల్లాలో మొత్తం 104 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 20 సర్కార్ బిల్డింగ్ లు కాగా మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం వీటిని పల్లె దవాఖానాలుగా మారుస్తోంది. ఒక్కో పల్లె దవాఖానలో మూడు గదులు, ఒక స్టోర్ రూం ఉండేలా డిజైన్ చేయగా 1,020 చదరపు ఫీట్లలో వీటిని నిర్మిస్తున్నారు. బిల్డింగ్ ల కోసం గ్రామ పంచాయతీలు స్థలాలను కేటాయించాయి.
ఇప్పటివరకు సుమారు 30 సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుకు మార్చారు. వీటికి పక్కా బిల్డింగ్ లను నిర్మించే పనులు సాగుతున్నాయి. మొదటి విడతగా గతేడాది దేవరుప్పుల మండలం చిన్నమడూరు, జనగామ మండలం పెంబర్తి, వడ్లకొండ, బచ్చన్నపేట మండలం కట్కూరు, కొన్నె, స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండ ఎస్సీ బస్తీ, సముద్రాల, కోమటిగూడెం, పాలకుర్తి మండలం విస్నూరు, వావిలాల, ముత్తారం, చిల్పూరు మండలం శ్రీపతిపల్లి, కొడకండ్ల మండలం ఏడునూతుల, లక్ష్మక్కపల్లిలో మొత్తం 15 దవాఖానాల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. వీటిలో కేవలం ఆరు బిల్డింగ్ ల నిర్మాణ పనులు మాత్రమే చివరి దశకు చేరుకోగా మిగిలిన వాటి పనులు ఆలస్యం అవుతున్నాయి. స్టేషన్ ఘన్ పూర్ ఎస్సీ బస్తీ దవాఖాన పనులు ఇంకా స్లాబ్ దశలోనే ఉన్నాయి. కోమటిగూడెం, నమిలిగొండ బిల్డింగ్ లదీ అదే పరిస్థితి.
టెండర్ దశలోనే రెండో విడత
మొదటి విడతలో ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి కాకుండానే రెండో విడత కింద మూడు నెలల క్రితం మరో 15 బిల్డింగ్ లను మంజూరు చేశారు. ఇందులో దేవరుప్పుల మండలం మాదాపురం, దేవరుప్పుల, ధర్మాపురం, నర్మెట మండలం ఆగాపేట, గండిరామారం, నర్మెట్ట, పాలకుర్తి మండలం కొండాపూర్, మంచుప్పుల, పాలకుర్తి, దర్దేపల్లి, చిల్పూరు మండలం చిల్పూరు, జనగామ మండలం పెదరాంచర్ల, బచ్చన్నపేట1, 2తో పాటు కొడకండ్లను ఎంపిక చేశారు. వీటికి సంబంధించిన పనులు ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి. తాజాగా మూడో విడత కింద మరో 47 బిల్డింగ్ లకు సాంక్షన్ వచ్చింది. వీటితో కలిసి జనగామ జిల్లాలో ఇప్పటివరకు 77 బిల్డింగ్ ల నిర్మాణానికి అనుమతులు వచ్చినట్లైంది.
పల్లె దవాఖానాల నిర్మాణ పనులను పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఇప్పటివరకు ఒక్క బిల్డింగ్ కు కూడా పూర్తి చేయని అదే డిపార్ట్ మెంట్ కు కొత్త బిల్డింగ్ ల పనులు కూడా అప్పగించాలనే నిర్ణయంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీఎస్ ఎంఐడీసీకి పనులు అప్పగిస్తే లేట్ అవుతాయన్న భావనతో పంచాయతీ రాజ్ శాఖకు అప్పగిస్తే అక్కడా అదే పరిస్థితి నెలకొనడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలివిడతలో చేపట్టిన 15 బిల్డింగ్ లకు రూ. 16 లక్షల చొప్పున కేటాయించారు. ఆ నిధులు సరిపోకపోవడంతో రూ.20 లక్షలకు పెంచారు. దేవరుప్పుల మండలం చిన్నమడూరు బిల్డింగ్ పూర్తి కాగా రంగులు వేస్తున్నారు. మిగిలిన పనులు వారం, పది రోజుల్లో తుది దశకు వస్తాయని ఆఫీసర్లు చెబుతున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది.
త్వరలోనే పనులు పూర్తి
మొదటి విడతలో మంజూరైన పల్లె దవాఖానాల నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. వీటిని పూర్తి చేసి వైద్య శాఖకు అప్పగిస్తాం. తాజాగా మరో 47 బిల్డింగ్ లకు సాంక్షన్ వచ్చింది. ఈ పనులను కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
- చంద్రశేఖర్, పీఆర్ ఈఈ, జనగామ