భద్రాచలం, వెలుగు : పదేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి శూన్యమని త్రిపుర మాజీ సీఎం, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు మాణిక్ సర్కార్ విమర్శించారు. భద్రాచలం నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి కారం పుల్లయ్య తరపున శనివారం రాత్రి ఆయన ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డాయన్నారు.
బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని, బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకనే దేశంలో ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగం పెరిగిందని, అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. మాజీ ఎంపీ మిడియం బాబురావు, జిల్లా పార్టీ కార్యదర్శి అన్నవరపు కనకయ్య తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.