- గతేడాది పోసిన నీళ్లకు ఫండ్స్రిలీజ్ చేయని ప్రభుత్వం
- పైసలు లేక నామ్‌కే వాస్తేగా వ్యవహరిస్తున్న బీట్‌ఆఫీసర్లు
- తాగునీటి కోసం అలమటిస్తున్న అడవి జంతువులు
- ప్రభుత్వం వెంటనే ఫండ్స్రిలీజ్ చేయాలని డిమాండ్
లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లాలో తాగునీరు లేక అడవి జంతువులు అలమటిస్తున్నాయి. ఫారెస్ట్‌లో వన్యప్రాణుల దప్పిక తీర్చేందుకు ఏర్పాటు చేసిన సాసర్పిట్లలో బీట్‌ఆఫీసర్లు నామ్‌కే వాస్తే గా నీళ్లు పోస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 82వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాందారి, మాచారెడ్డి, బాన్సువాడ, పిట్లం, జుక్కల్మండలాల్లో విస్తరించి ఉన్న ఫారెస్ట్‌లో మనుబోతులు, జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, అడవి ఆలుగులు తదితర వన్యప్రాణులు వేల సంఖ్యలో ఉండగా, చిరుత పులులు, ఎలుగు బంట్లు, అడవి కుక్కలు పదుల సంఖ్యలో ఉన్నాయి.
జిల్లాలో 220 కి పైగా సాసర్ పిట్లు
2010 నుంచి జిల్లాలోని ఫారెస్ట్ లో అధికారులు సాసర్ పిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 8 అటవీ రేంజ్‌ల పరిధిలో 220కి పైగా సాసర్ పిట్లు ఉన్నాయి. ఏటా ఫిబ్రవరి నుంచి మే వరకు వన్యప్రాణులు దాహార్తిని తీర్చేందుకు సాసర్ పిట్లలో తప్పకుండా నీళ్లు పోయాలని ఫారెస్ట్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఒక్కో సాసర్‌పిట్‌లో పది రోజులకోసారి నీళ్లునింపాలని ఆదేశాలు జారీ చేశారు. 4 నెలల పాటు జంతువుల తాగునీటి లక్షల రూపాయల ఫండ్స్‌ను ప్రభుత్వం కేటాయిస్తోంది.
నామ్‌కే వాస్తేగా నింపుతున్న ఫారెస్ట్ ఆఫీసర్లు
నీటిని నింపే బాధ్యతను ప్రభుత్వం బీట్ఆఫీసర్లకు అప్పగించింది. కానీ బీట్‌ఆఫీసర్లు నెలలో 3 సార్లు నీటిని పోయాల్సి ఉండగా, ఎప్పుడో ఒకసారి పోసి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు చెప్తున్నారు. ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోని ఆయా బీట్లలోని సాసర్ పిట్లలో ఇంతవరకు నీటిని పోయలేదు. మాచారెడ్డి, పిట్లం, నాగిరెడ్డిపేట రేంజ్‌ల పరిధిలో అడపాదడపా పోస్తుండగా, మిగతా రేంజ్‌లలో సాసర్ పిట్లు నీళ్లు లేక వెల వెల బోతున్నాయి. దీంతో జంతువులు గ్రామాల శివార్లలో ఉండే చెరువులు, వ్యవసాయ బోర్ల వద్దకు తాగునీటి కోసం వస్తుండగా, వేటగాళ్లు అమర్చిన కరెంట్ షాక్, ఉచ్చుల్లో పడి చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు ఇవ్వకపోవడంతోనే ..
గత ఏడాది పోసిన నీళ్ల డబ్బులు ప్రభుత్వం నేటికీ చెల్లించక పోవడంతోనే బీట్‌ఆఫీసర్లు సాసర్ పిట్లలో నీళ్లు పోయడం లేదని తెలుస్తోంది. సాసర్ పిట్లలో నీళ్లు పోయడానికి అయ్యే ఖర్చును సెక్షన్, బీట్ ఆఫీసర్లు సొంతంగా భరించారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఫండ్స్రిలీజ్ చేయలేదు. ఈ ఏడాది కూడా పైసా విడుదల చేయకపోవడంతో చాలా ప్రాంతాల్లోని సాసర్ పిట్లలో నీటిని పోయడం లేదు. ‘ నీళ్లు పోయాలని ఆదేశిస్తున్నారు.. కానీ పైసలు మాత్రం ఇస్తలేరు’ అని ఓ బీట్ఆఫీసర్ బహిరంగంగానే చెప్పడం గమనార్హం. ఇప్పటికైనా వెంటనే ఫండ్స్రిలీజ్చేసి వన్యప్రాణుల దప్పిక తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.
రేంజ్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చాం
వన్యప్రాణుల దూప తీర్చేందుకు ఏర్పాటు చేసిన సాసర్పిట్లలో నీళ్లు పోయించాలని గతంలోనే రేంజ్ బీట్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చాం. ప్రభుత్వం నిధులు మంజూరు కాగానే బిల్లులు చెల్లిస్తాం. గతేడాది పోసిన నీళ్లకు బిల్లులు రాని మాట వాస్తవమే.. రాగానే రెండు బిల్లులు చెల్లిస్తాం.
– గోపాల్‌రావు, ఎఫ్‌డీవో, కామారెడ్డి