ప్రతాపరుద్రుని కోటను పట్టించుకుంటలే

ప్రతాపరుద్రుని కోటను పట్టించుకుంటలే
  • అభివృద్ధికి రెండేళ్ల కింద రూ.50 లక్షలు ఇస్తామన్న అప్పటి కలెక్టర్
  • రోడ్డు వేసి చేతులు దులుపుకున్న ఆఫీసర్లు

నాగర్‌‌‌‌ కర్నూల్‌‌, వెలుగు: అందమైన లోయలు,అద్భుతమైన జలపాతాలు, మైమరిపించే పుణ్యక్షేత్రాలకు నెలవైన నల్లమలలోని  ప్రతాపరుద్ర కోటను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అమ్రాబాద్ మండలం మన్ననూర్ శివారులోని ఘాట్‌‌రోడ్డు నుంచి 2 కిలో మీటర్ల దూరంలో, 280 అడుగుల ఎత్తులో గుట్టపై ఉండే ఈ కోటను రెండేళ్ల కింద అప్పటి కలెక్టర్‌‌‌‌ స్వయంగా సందర్శించి ఎకో టూరిజం స్పాట్‌‌గా డెవలప్ చేస్తామని ప్రకటించినా.. నేటికీ అతీగతీ లేకుండా పోయింది. అధికారులు కేవలం మట్టి రోడ్డేసి చేతులు దులుపుకున్నారు. పత్తా లేకుండా పోయిన ప్రపోజల్స్ ప్రతాపరుద్రుని కోటను 2020 ఆగస్టులో అప్పటి కలెక్టర్‌‌‌‌ శర్మన్ ఫారెస్ట్, టూరిజం ఆఫీసర్లతో కలిసి కాలినడకన గుట్ట మీదికి వెళ్లి కోటను పరిశీలించారు. శ్రీశైలం వెళ్లే టూరిస్టులను ఆకర్షించేలా ఎకో టూరిజం డెవలప్‌‌ చేస్తామని, కోట సుందరీకరణతో పాటు వ్యూ పాయింట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ. 50 లక్షలు ఖర్చు చేస్తామని, ఈ మేరకు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపిస్తామని తెలిపారు. అనంతరం ఆఫీసర్లు గుట్ట వరకు మట్టి రోడ్డు వేశారు. అంతే మళ్లీ కనిపించలేదు.  

ఎన్నో విశేషాలు 
13వ శతాబ్దానికి చెందిన కాకతీయులు 700 సంవత్సరాల కింద నల్లమల అటవీప్రాంతంలో ప్రతాపరుద్రుని కోటను నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. దట్టమైన అడవి మధ్యలో గుట్టపైన నిర్మించిన కోటపై ఏడు పుష్కరిణులు, జలపాతాలు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కొండపైన ఉన్న కోనేరులో ఇప్పటికీ నీళ్లు నిల్వ ఉండడం, గుర్రాల శాలతో పాటు వాటికి వేసే వరిపొట్టు కనిపిస్తుండడం విశేషం. శివాలయం, ఆంజనేయ ఆలయాల ఆనవాళ్లు, ధాన్యం దాచుకునే గానుగలు, గోడలపై కాకతీయ గుర్తులు, కొద్దిదూరంలో విరిగి పడ్డ కోట గోడలు, బురుజులు కనిపిస్తాయి. శ్రీశైలం మెయిన్ రోడ్డుపై ఉండే కోట రాతి ముఖ ద్వారం, మార్గం గుండా పొడవాటి రాతి కుడ్యం చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ విశేషాలను డీఎఫ్‌‌వో కిష్టాగౌడ్ కలెక్టర్‌‌‌‌కు వివరించిన తర్వాత ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించారు.  

శిథిలమైన కోట
ప్రతాపరుద్రుని కోట చాలా వరకు శిథిలమైపోయింది. గుప్తనిధుల వేటలో దుండగులు పలు కట్టడాలను కూల్చేశారు. ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరిపారు. ఇప్పటికీ క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కూలిన కోట గోడలు, ఆలయాలను పనరుద్ధరించి, వ్యూ పాయింట్ ఏర్పాటు చేస్తే పర్యాటకులు ఎక్కువగా వచ్చే ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం, మద్దిమడుగు, అక్కమహాదేవి గుహలు, దత్తపాదుకలు, అక్టోపస్‌‌, పర్హాబాద్ వ్యూ పాయింట్ల సరసన ఇది కూడా చేరుతుంది. కాగా, కలెక్టర్ ఖర్చు చేస్తామన్న రూ. 50 లక్షల సంగతి ఇటు ఫారెస్ట్‌‌, అటు టూరిజం అధికారులు చెప్పడం లేదు. టూరిజం స్పాట్‌‌ ప్రపోజల్స్ ఉన్నాయో.. లేవో..? తెలియడం లేదు.